
ఎత్తిపోతలు.. ఉత్తమాటలు
జి.కొండూరు: ఎత్తిపోతల పథకాల విషయంలో ప్రజాప్రతినిధివి ఉత్తిమాటలుగా మారుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో చింతలపూడి పూర్తి చేసి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేస్తానని ఎన్నికల ప్రసంగాల్లో ఎమ్మెల్యే ఊదరగొట్టారు. చింతలపూడి సంగతి దేవుడెరుగు మైలవరం నియోజకవర్గానికి జీవనాడిగా ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను సైతం గాలికొదిలేశారు. దశాబ్దాల చరిత్ర ఉన్న తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణ లోపం కారణంగా ప్రస్తుతం మోటార్లు పని చేయడం లేదు. కాలువంతా తూడు కాడతో నిండిపోయింది. పని చేస్తున్న ఒకటి, రెండు మోటార్లు ఎత్తిపోసినా నీరు ముందుకు కదలకు రైతులు నరకయాతన పడుతున్నారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటికీ నిర్లక్ష్యం నీడలోనే తారకరామ ఎత్తి పోతల పథకం ఉండటంతో ఈ ఏడాది కూడా సాగునీరందడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
నిర్వహణను గాలికొదిలేశారు
తారకరామ ఎత్తిపోతల పథకం నిర్వహణను స్థానిక ప్రజాప్రతినిధులు, ఇరిగేషన్ అధికారులు గాలికొదిలేశారు. తారకరామ కుడి కాల్వపై ఉన్న నాలుగు పంప్‌హౌస్‌లలో మోటార్లు సరిగా పనిచేయని పరిస్థితి నెలకొంది. 9.25 కిలోమీటర్ల మేర ఉన్న తారకరామ కుడి కాల్వలో ఎక్కడ చూసినా పిచ్చి మొక్కలు, తుమ్మ, జమ్ము, తూడు, మొదలైన వాటితో నిండిపోయాయి. దీంతో కాల్వలో నీరు ముందుకు నడవక పంపు హౌస్‌లలో ఉన్న మోటార్లకు నీరందడంలేదు. ఈ నాలుగు పంపు హౌస్‌లలో 14 మోటార్లు ఉండగా 8 పూర్తిగా పని చేయడంలేదు. మిగిలిన ఆరు మోటార్లు కూడా విద్యుత్ లోఓల్టేజీ కారణంగా, తూడు కాడతో మోటార్లకు నీరందక, మరమ్మతులు జరగక అంతంతమాత్రం పని చేస్తున్నాయి.
ఆయకట్టు కింద 4,820 ఎకరాలు
తారకరామ ఎత్తిపోతల పథకం మొదటి పంప్ హౌస్ నుంచి రెండో పంప్ హౌస్‌కి మధ్య ఆయకట్టు సాగు భూమి 850 ఎకరాలు ఉంది. కట్టుబడిపాలెం సమీపంలో రెండో పంపుహౌస్ నుంచి మూడవ పంపు హౌస్‌కు మధ్య ఆయకట్టు 980ఎకరాలు ఉంది. పినపాక గ్రామం సమీపంలోని మూడవ పంప్ హౌస్ నుంచి నాలుగో పంప్‌హౌస్‌కు మధ్య ఆయకట్టు 1,123ఎకరాలు ఉంది. జి.కొండూరు సమీపంలో నాలుగో పంప్‌హౌస్ కింద ఆయకట్టు 1,867ఎకరాలు ఉంది. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పంప్ హౌస్‌ల నిర్వహణను గాలికి వదిలి వేయడంతో మోటార్లు సరిగా పని చేయడం లేదు. ఈ నాలుగు పంప్ హౌస్‌ల కింద ఉన్న 4,820 ఎకరాల వ్యవసాయ భూమికి నీరందడంలేదు. ప్రారంభం నుంచి 6.6కిలోమీటర్లు వద్దనే నిలిచిపోయిన ఎడమ కాల్వలో సైతం తూడుకాడ పెరిగి నీరు అంతం మాత్రంగానే ప్రవహిస్తోంది. ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఈ ఎత్తిపోతల పథకంపై దృష్టిసారిస్తే రైతులకు కష్టాలు తొలగిపోతాయి.
చింతలపూడి పూర్తి చేసి ఆరునెలల్లో నీరందిస్తానన్న ప్రజాప్రతినిధి!
తారకరామ ఎత్తిపోతల నిర్వహణను గాలికొదిలేసిన వైనం
మోటార్లు పనిచేయక, తూడుకాడతో నీరు ముందుకు కదలక రైతుల గగ్గోలు
ఆయకట్టులో 4,820 ఎకరాల సాగు ప్రశ్నార్థకం
తారకరామ కుడికాల్వపై ఉన్న నాలుగు పంపుహౌస్‌ల వివరాలు
అంశాలు మొదటి లిఫ్ట్ రెండవ లిఫ్ట్ మూడవ లిఫ్ట్ నాల్గవ లిఫ్ట్
మోటార్లు సంఖ్య 4 4 3 3
పనిచేయని మోటార్లు 2 2 2 2
మోటార్ల కెపాసిటీ ఎచ్‌పీ 120 120 120 75
నీటి సామర్థ్యం క్యూసెక్‌లు 57.84 57.84 38.56 30.36
ఆయకట్టు ఎకరాలు 850 980 1123 1867
మరమ్మతులకు ప్రతిపాదనలు సిద్ధం
తారకరామ ఎత్తిపోతల పథకంలో మోటార్ల మరమ్మతులకు రూ.3.57 కోట్ల వ్యయ అంచనాలతో ప్రతిపాదనలను సిద్ధం చేశాం. ఏపీ జెన్‌కో అధికారులు ఇటీవల పరిశీలించారు. ప్రతిపాదనలు పంపిన తర్వాత నిధులు మంజూరు కాగానే పనులను ప్రారంభిస్తాం. తారకరామ కుడి, ఎడమ కాల్వల్లో తూడుకాడ తొలగించడానికి రూ.8.9 లక్షలతో ప్రతిపాదనలు పంపాం.
–జి.వెంకటేశ్, తారకరామ ఏఈ

ఎత్తిపోతలు.. ఉత్తమాటలు

ఎత్తిపోతలు.. ఉత్తమాటలు

ఎత్తిపోతలు.. ఉత్తమాటలు