
శ్రీమన్నారాయణుడి ఆలయంలో కోటి అష్టాక్షరీ మహాయజ్ఞం
కోడూరు: అభినవ మేల్కోటగా పేరుగాంచిన ఉల్లిపాలెం గోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామి ఆలయంలో కోటి అష్టాక్షరీ మహాయజ్ఞాన్ని (శ్రీమన్నారాయణ యజ్ఞం) భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఆలయ నిర్మాణకర్త త్రిదండి అష్టాక్షరీ సంపత్‌కుమార రామానుజీయర్ స్వామి తెలిపారు. ఆదివారం ఆలయ ప్రాంగణంలో మహాయజ్ఞం నిర్వహణపై వివిధ వర్గాల ప్రముఖులతో స్వామీజీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 16 నుంచి 28 వరకు 13 రోజుల పాటు మహాయజ్ఞం నిర్వహించేందుకు పండితులు ముహూర్తాన్ని నిర్ణయించినట్లు స్వామిజీ చెప్పారు. దీనికి13 ప్రత్యేక యాగశాలలను నిర్మించడంతో పాటు అందులో 108 హోమగుండాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రతి రోజూ కోటి సార్లు అష్టాక్షరీ మంత్రాన్ని జపించనున్నట్లు స్వామీజీ తెలిపారు.
ఆలయంలో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు
శ్రీమన్నారాయణుడి ఆలయంలో ప్రస్తుతం రూ.2 కోట్లతో అభివృద్ధి పనులను నిర్వహిస్తున్నట్లు అష్టాక్షరీ స్వామి చెప్పారు. రూ.కోటితో గాలిగోపురం నిర్మాణం జరుగుతుండగా పనులు తుదిదశకు చేరినట్లు తెలిపారు. ఆలయం ఉత్తర, దక్షిణ ద్వారాలకు ఆర్చిల నిర్మాణాలు చేస్తున్నట్లు చెప్పారు. మహాయజ్ఞం సమయానికి అభివృద్ధి పనులను పూర్తి చేయనున్నట్లు చెప్పారు. మహాయజ్ఞంపై రాష్ట్ర వ్యాప్త ప్రచారానికి ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఆలయంలో ప్రతి శని, ఆదివారాలు అన్నదానం ఏర్పాటుకు కృషి చేస్తున్న దాతలను సత్కరించారు. బృందావనం పీఠాధిపతి అష్టాక్షరీ బృందావనం స్వామీజీ, అనంతపురానికి చెందిన వ్యాపారవేత్త దామోదర్‌దాస్, ఆర్యవైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 16 నుంచి 28 వరకు నిర్వహణ
అష్టాక్షరీ స్వామి ఆధ్వర్యంలో సమావేశం