
డీఈఓ కార్యాలయం ముట్టడి
మచిలీపట్నంఅర్బన్: జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు గుర్తింపు లేకుండా నడుపుతున్న యాజమాన్యాలు, అధిక ధరలకు పాఠ్యపుస్తకాలు అమ్ముతున్న ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్), పెట్రియాటిక్ డెమోక్రటిక్ మూవ్మెంట్ సంయుక్త ఆద్వర్యంలో శుక్రవారం డీఈవో కార్యాలయాన్ని ముట్టడించారు. వారు విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి ధర్నా చేశారు. డీఈఓ ముందు బైఠాయించి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పీడీఎం జిల్లా కన్వీనర్ అరవింద్, ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయికుమార్ కలెక్టర్ బాలాజీకి వినతిపత్రం సమర్పించారు. ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి సాధిక్ బాబు తదితరులు పాల్గొన్నారు.