రెవెన్యూ శాఖ సేవలు వెలకట్టలేనివి
చిలకలపూడి(మచిలీపట్నం) : రెవెన్యూశాఖ అందించే సేవలు వెలకట్టలేనివని, అభివృద్ధిలో వారి పాత్ర ఎంతో కీలకమని రాష్ట్ర గనులు, భూగర్భవనరులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. రెవెన్యూ దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ వరదలు, తుపానుల సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా సేవలు అందించేది రెవెన్యూ విభాగమేనన్నారు. ఏ ప్రభుత్వంలో పనిచేసినా రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా చట్టప్రకారం వ్యవహరించి ప్రజలకు న్యాయం చేయాలని సూచించారు. కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, కలెక్టర్ డీకె బాలాజీ, ఎస్పీ గంగాధరరావు తదితరులు మాట్లాడుతూ రెవెన్యూ సేవలను కొనియాడారు. అనంతరం రెవెన్యూ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన రెవెన్యూ అధికారులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన ఏపీఎస్‌ఆర్టీసీకి చెందిన ఉద్యోగుల వారసులు 64 మందికి కారుణ్య నియామక పత్రాలు అంద జేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలిశర్మ, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవో కె.స్వాతి, వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోన ఆంజనేయకుమార్, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సీహెచ్ వీరాంజనేయప్రసాద్, ఎంవీ శ్యామ్‌నాఽథ్, పేటేటి సత్యనారాయణ, రిటైర్డ్ తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఎవరి దారి వారిదే...
రెవెన్యూ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ బాలశౌరి ఎవరి దారి వారిదే లాగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా కార్యక్రమానికి ఎంపీ బాలశౌరి హాజరయ్యారు. ఆయన ప్రసంగం పూర్తయిన తరువాత వెళ్లిపోయారు. తరువాత మంత్రి కొల్లు రవీంద్ర కార్యక్రమానికి హాజరై ప్రసంగించారు. ఇటీవల జరిగిన మసులా బీచ్ ఫెస్టివల్ నాలుగురోజుల కార్యక్రమాల్లో కూడా ఎంపీ బాలశౌరి ఎక్కడా లేకపోవటంతో వీరిరువురి మధ్య అంతరం పెరిగిందని టీడీపీ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


