
గడువుకు ముందే పరిశ్రమలకు అనుమతులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): రాష్ట్ర ప్రభుత్వం యాప్ ఆధారిత డిజిటల్ వాట్సాప్ గవర్నెన్స్ (మన మిత్ర) ద్వారా ప్రజలకు 500కు పైగా సేవలు అందిస్తోందని, ఇందులో పారిశ్రామిక సేవలపై పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలకు అవగాహన కల్పించి, సద్వినియోగం చేసుకొనేలా ప్రోత్సహించాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ అధ్యక్షతన జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ) సమావేశం వర్చువల్‌గా జరిగింది. ఈ సమావేశంలో పారిశ్రామిక విధానాల కింద పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, పారిశ్రామిక అనుమతులు తదితరాలపై చర్చించారు. 2025, ఏప్రిల్ 1 నుంచి మే 26 వరకు సింగిల్ డెస్క్ పోర్టల్ ద్వారా పారిశ్రామిక అనుమతులకు సంబంధించి 824 దరఖాస్తులు స్వీకరించారన్నారు. ఇప్పటికే 762 దరఖాస్తులు ఆమోదం పొందాయని పరిశ్రమల శాఖ అధికారులు వివరించారు.. మిగిలిన దరఖాస్తులను కూడా నిర్దేశిత గడువుకు ముందే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
ప్రోత్సాహకాలపై స్క్రూటినీ..
పారిశ్రామిక అభివృద్ధి విధానం (2015–20), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2020–23), పారిశ్రామిక అభివృద్ధి విధానం (2023–27) కింద ఎంఎస్‌ఎంఈ రంగానికి అందించే ప్రోత్సాహకాలపై స్క్రూటినీ కమిటీ సమావేశాలు నిర్వహించిందని కలెక్టర్ చెప్పారు. 90 క్లెయిమ్‌లకు రూ. 4.13కోట్లు మేర ప్రతిపాదనలు పంపగా.. వీటిపై తాజాగా చర్చించి డీఐఈపీసీ ఆమోదం తెలిపిందన్నారు. సమావేశంలో డీఆర్‌వో ఎం. లక్ష్మీనరసింహం, ఇన్‌చార్జ్ జిల్లా పరిశ్రమల అధికారి ఆర్.వెంకటరావు తదితరులు పాల్గొన్నారు.
ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ