
బీచ్ ఫెస్టివల్ బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మంగినపూడి బీచ్‌లో జరిగే బీచ్ ఫెస్టివల్‌ను దిగ్విజయంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ ఆర్.గంగా ధరరావు తెలిపారు. ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే బీచ్ ఫెస్టివల్‌ను పురస్కరించుకుని మంగినపూడి బీచ్‌ను ఎస్పీ మంగళవారం సందర్శించారు. అక్కడ జరుగుతున్న భద్రతా ఏర్పాట్లను పరి శీలించారు. బందోబస్తుకు సంబంధించి అధికా రులు, సిబ్బందికి దిశానిద్దేశం చేశారు. అనంతరం ఎస్పీ గంగాధరరావు మాట్లాడుతూ.. ముంగినపూడి బీచ్‌లో మూడు రోజులు ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే బీచ్ ఫెస్టివల్‌కు పటిష్ట బందోబస్తు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ మళ్లింపు సక్రమంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. హెలిప్యాడ్, సభా వేదిక చుట్టుపక్కల ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామన్నారు. వాచ్ టవర్స్ ఏర్పాటు చేసి పర్యాటకులు బీచ్ లోతుకు వెళ్లకుండా పబ్లిక్ అడ్రెస్సింగ్ సిస్టం ద్వారా అప్రమత్తం చేసేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. ఉత్సవాలు జరిగే మూడు రోజులు గజ ఈతగాళ్లను బీచ్ వద్ద అందుబాటులో ఉంచుతామన్నారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ సాయిబాబు, అవనిగడ్డ తహసీల్దార్ హరనాథ్, బందరు డీఎస్పీ సీహెచ్.రాజ, బందరు రూరల్ ఎస్‌ఐ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.