
ప్రతి సమస్యను పరిష్కరిస్తాం
కోనేరుసెంటర్: మీకోసం కార్యక్రమంలో అందిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ ఆర్.గంగాధరరావు తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన మీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. వారి సమస్యలను సానుకూలంగా ఆలకించిన ఎస్పీ ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అధైర్యపడొద్దు...ప్రతి ఒక్కరికీ పోలీసులు అండగా ఉంటారంటూ భరోసా కల్పించారు. స్టేషన్ల వారీగా అందిన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఫిర్యాదుదారుల మన్ననలు పొందేందుకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. అర్జీదారులతో అమర్యాదగా మాట్లాడినా, సూటిబోటి మాటలతో అవమానించినా శాఖాపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అందరితోనూ అభిమానంగా మాట్లాడాలని, వారి సమస్యను మన సమస్యగా భావించాలని, ఏ ఒక్కరు అసహనంతో వెనుతిరిగి వెళ్లకూడదని, ఆ విధంగా పోలీసులు పనిచేయాలని ఉద్బోధించారు.
ప్రధానమైన అర్జీలు :
సోమవారం జరిగిన మీకోసంలో 41 ఫిర్యాదులను ఎస్పీతో పాటు ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.సత్యనారాయణ అందుకున్నారు.
● గూడూరు నుంచి వెంకయ్య అనే వృద్ధుడు తన ఇద్దరు కుమారులు వృద్ధాప్యంలో ఉన్న తామిద్దరికీ భోజనం పెట్టకుండా, వైద్య ఖర్చులు, మందులకు డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని, వ్యవసాయ పొలం తాలూకు కౌలు డబ్బులు కూడా తీసుకుని ఇబ్బంది పెడుతున్నారని, న్యాయం చేయమని ప్రాధేయపడ్డాడు.
● గుడివాడ నుంచి పుష్ప అనే మహిళ తనకు వివాహం జరిగే నాటికి తన భర్తకు చెడు వ్యసనాలు ఉన్నాయని, ఈ సంగతిని దాచి పెట్టి వివాహం జరిపించారని, ఇటీవల పూటుగా మద్యం తాగుతూ మానసికంగా, శారీరకంగా హింసలకు గురి చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. బయట వ్యక్తుల దగ్గర అప్పులు చేస్తూ వారి నుంచి తనకు ప్రాణ హాని కలిగేలా చేస్తున్నాడని తనకు రక్షణ కల్పించి న్యాయం చేయమని కోరింది.
● చల్లపల్లి నుంచి కుమారి అనే వివాహిత వచ్చి తనకు వివాహం జరిగి 7 సంవత్సరాలు అవుతోందని, ఒక కుమార్తె జన్మించిందని, అప్పటినుంచి తన భర్త మితిమీరిన అనుమానంతో తీవ్ర వేధింపులకు గురి చేస్తూ పుట్టింటికి పంపించేశాడని, కనీసం కుమార్తెను బతికించుకోవడానికి డబ్బు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నాడని వాపోయింది. ఉద్యోగానికి వెళ్దామన్నా సర్టిఫికెట్స్ ఇవ్వకుండా ఎటువంటి ఆధారం లేకుండా చేస్తున్నాడని న్యాయం చేయమని వేడుకుంది. బాధితుల సమస్యలు ఆలకించిన ఎస్పీ చట్ట పరిధిలో ప్రతి ఒక్కరి సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మీకోసంలో అర్జీలు స్వీకరించిన జిల్లా ఎస్పీ
అర్జీల పరిష్కారానికి సిబ్బందికి ఆదేశాలు