
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల దుర్మరణం
మూలపాడు(ఇబ్రహీంపట్నం): రెక్కాడితే గాని డొక్కాడని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై సోమవారం ఉదయం జరిగింది. సేకరించిన వివరాల మేరకు.. ఇబ్రహీంపట్నంకు చెందిన తొమ్మిది మంది మహిళా వ్యవసాయ కూలీలు సమీపంలోని కేతనకొండ గ్రామంలో మిరపకాయల కోతకు వెళ్లేందుకు ఆటోలో బయలుదేరారు. మూలపాడు నుంచి రాంగ్‌రూట్‌లో కేతనకొండ వైపు ఆటో వెళ్తున్న క్రమంలో జెడ్పీ పాఠశాల సమీపంలో హైదరాబాద్ వైపు నుంచి ఎదురుగా వస్తున్న వాహనం కూలీల ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కూలీలు పదిమీటర్ల దూరంలో గాల్లోకి ఎగిరి చెల్లాచెదురుగా పడ్డారు. వారిలో వేల్పుల మరియమ్మ(45), భూక్యా దుర్గ(49) ఘటనా స్థలంలోనే మృతి చెందారు. మరో ఏడుగురికి గాయాలయ్యాయి. గాయపడిన మూఢావత్ గౌరి పరిస్థితి విషమంగా ఉంది. కన్నెగంటి స్వప్న, వేల్పుల మరియమ్మ, చింత వసంత, షేక్ మౌలాబీ, వెంకటకుమారి, తుపాకుల దుర్గ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వేల్పుల మరియమ్మ, భూక్యా దుర్గ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ చంద్ర శేఖర్ తెలిపారు.
కూలీల ఆటోను ఢీకొట్టిన కారు
మరో ఏడుగురికి గాయాలు,
ఒకరి పరిస్థితి విషమం
ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం
సమీపంలో ఘటన

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళల దుర్మరణం