
గుర్రంపై గంజాయి తరలింపు
వత్సవాయి :గుర్రంపై గంజాయి అమ్మకాన్ని వత్సవాయి పోలీసులు గుట్టరట్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. తెలంగాణలోని వేరే ప్రాంతాల నుంచి గంజాయిను గుర్రం మీద తీసుకొస్తారు. గుర్రంపై ఉన్న సంచుల్లో గంజాయి ప్యాకెట్లను వేసుకుని వస్తారు. గుర్రం మీద ఒకరు... గుర్రాన్ని అనుసరిస్తూ మరొకరు బైక్‌పై వస్తారు. అయితే అప్పుడుప్పడు గుర్రం వత్సవాయి ఎస్సీ కాలనీకి రావడాన్ని గమనించిన కొందరు అనుమానంతో పోలీసులకు రహస్యంగా సమాచారం అందించారు. శనివారం రాత్రి సమయంలో ఎస్సీ కాలనీ వద్ద గుర్రాన్ని నిలిపి కొందరు యువకులు మాట్లాడుకుంటుండగా పోలీసులు దాడిచేసి వారిని పట్టుకున్నారు. దీంతో గుర్రంపై నున్న సంచిలో గంజాయి ప్యాకెట్లు ఉండడాన్ని గమనించి వెంటనే గుర్రంతోపాటు నంబర్‌లేని బైక్, వత్సవాయికి చెందిన ఇద్దరు యువకులను అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు. అయితే గుర్రాన్ని తీసుకొని వచ్చిన కొందరు యువకులు మాత్రం పరారయ్యారు. ఎస్‌ఐ పి. ఉమామహేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పిడుగుపడి యువకుడి మృతి
కోసూరు(మొవ్వ): ఉపాధి కోసం పని మాట్లాడుకోవడానికి వెళ్తూ పిడుగుపడి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మాతంగి సుప్రదీప్ (22) వెల్డింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తుంటాడు. పని మాట్లాడుకోవడానికి తన మిత్రుడు పాగోలు అనిల్ కుమార్‌తో కలిసి బైక్ మీద బాపట్ల జిల్లా కొల్లూరు ప్రయాణమయ్యాడు. వీరు కోసూరు నుంచి కొడాలి మీదగా శ్రీకాకుళం కృష్ణానదిలోని బాట నుంచి వెళుతుండగా ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులు వచ్చి బైక్ వెళ్తున్న సుప్రదీప్‌పై పిడుగు పడింది. ఈ ఘటనలో సుప్రదీప్ సంఘటన స్థలంలోనే మృతి చెందగా అనిల్ కుమార్‌కు స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సమీపంలో ఉన్న వారు 108కు సమాచారం అందించగా వారు వచ్చి సుప్రదీప్ మృతి చెందాడని నిర్దారించి అనిల్ కుమార్‌ను ఆసుపత్రికి తరలించారు. కాగా సుప్రదీప్ మృతి వార్త తెలుసుకోవటంతో ఒక్కసారిగా కోసూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతుడు రెండు సంవత్సరాల క్రిందట ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఏడాది వయస్సు ఉన్న కుమారుడు ఉన్నాడు.

గుర్రంపై గంజాయి తరలింపు

గుర్రంపై గంజాయి తరలింపు