
కలగానే చింతలపూడి ఎత్తిపోతల!
తిరువూరు: చింతలపూడి ఎత్తిపోతల పథకం కలగానే మిగిలేలా ఉంది. ఏళ్లు గడుస్తున్నా పనులు ముందుకు సాగకపోవడంతో ప్రజలు తీవ్ర నిరాశ చెందుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం సాగర్ జలాల సరఫరా అరకొరగా ఉండటంతో కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలకు ప్రత్యామ్నాయంగా చేపట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకం ఏళ్లు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. 2009లో రూ.5వేల కోట్ల అంచనాతో ఈ ప్రాజెక్టు మొదటిదశ పనులను ప్రారంభించారు. ఈ పనులు పూర్తికాకముందే 2017లో మళ్లీ టీడీపీ ప్రభుత్వం మరో రూ.3వేల కోట్లతో రెండో దశ పనులకు శ్రీకారం చుట్టింది. చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి సాగర్ ఆయకట్టులో ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూడా నీటి సదుపాయం కల్పించడానికి రెండో దశను చేపట్టారు. పిట్టలవారిగూడెం నుంచి వేంపాడు మేజరుకు గోదావరి జలాలను తెచ్చి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి సాగర్ ప్రధాన కాలువకు సరఫరా చేయడం ఈ పథకం ఉద్దేశం. 2028 నాటికి చింతలపూడి ఎత్తిపోతల పూర్తి చేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు పలుమార్లు చెబుతున్నా పనులు మాత్రం ప్రారంభం కాలేదని రైతులు వాపోతున్నారు.
8 సంవత్సరాలుగా పూర్తికాని పనులు
మెట్టప్రాంత రైతులు సాగునీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాధార పంటలు సాగుచేయడం, బోర్లకింద ఆరుతడి పంటలు వేయడంతో ఏడాదికి ఒక పంటకే పరిమితమయ్యే పరిస్థితి నెలకొంది. రానున్న 2, 3 సంవత్సరాల్లో సాగునీటి కొరత తీవ్రతరమయ్యే అవకాశం ఉన్నందున త్వరితగతిన చింతలపూడి రెండోదశ ఎత్తిపోతల పూర్తిచేసి సాగర్ కాలువలకు గోదావరి జలాలను సరఫరా చేయాలని కోరుతున్నారు.
సాగర్ జలాలకు
ప్రత్యామ్నాయంగా ప్రతిపాదన
ప్రకటనలకే పరిమితం
ఉమ్మడి కృష్ణాలో
ఐదు నియోజకవర్గాలకు ప్రయోజనం
18 మండలాలకు ప్రయోజనం....
చింతలపూడి ఎత్తిపోతల రెండో దశతో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 5 నియోజకవర్గాల్లోని 18 మండలాలకు సాగు, తాగునీటి కొరత తీర్చవచ్చని భారీ నీటిపారుదల శాఖ అంచనా వేసింది. ఉమ్మడి కృష్ణాలోని మైలవరం, తిరువూరు, గన్నవరం, నూజివీడు, నందిగామ నియోజకవర్గాల పరిధిలోని చాట్రాయి, ముసునూరు, విస్సన్నపేట, రెడ్డిగూడెం, మైలవరం, జి.కొండూరు, ఇబ్రహీపట్నం, కంచికచర్ల, వీరులపాడు, గంపలగూడెం, తిరువూరు, ఏకొండూరు, నూజివీడు, గన్నవరం, బాపులపాడు, ఉంగుటూరు, ఆగిరిపల్లి, విజయవాడ రూరల్ మండలాల్లో మెట్టభూములకు గోదావరి జలాలను సాగర్‌కు ప్రత్యామ్నాయంగా అందే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేశారు. వేంపాడు మేజరు నుంచి 10 కిలోమీటర్ల కాలువ తవ్వి రామచంద్రాపురం రెగ్యులేటరు వద్ద నూజివీడు బ్రాంచి కాలువకు అనుసంధానం చేయడం ద్వారా మైలవరం బ్రాంచి కాలువకు, మాధవరం, బాపులపాడు, రేపూడి, గానుగపాడు మేజర్లకు గోదావరి జలాలను సరఫరా చేయాలని లక్ష్యంగా ఉంది. రెండోదశ పనుతో లక్ష ఎకరాలకుపైగా పంట భూములకు సాగునీటి సమస్య తీరుతుందని భావించి భారీ నీటిపారుదల శాఖ పనులకు ప్రతిపాదించింది.

కలగానే చింతలపూడి ఎత్తిపోతల!