
కూటమి నేతలకు ధనార్జనే ధ్యేయం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: నార్ల తాతారావు ధర్మల్ పవర్ స్టేషన్ (ఎన్టీటీపీఎస్)లో విద్యుత్ ఉత్పత్తి అనంతరం వెలువడే బూడిద కూటమి నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. వారు బూడిద నిల్వ చేసి అమ్ముకునేందుకు వ్యాపార సామ్రాజ్యంగా మార్చుకున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతమంతా గాలి, నీటిలో బూడిద కలిసిపోయి ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడింది. తమ ఇళ్లు, పొలాల పైకి బూడిద కాలుష్యం వెదజల్లుతోందని ఇటీవల పశ్చిమ ఇబ్రహీంపట్నం స్థానికులు 65వ నంబర్ జాతీయ రహదారిపై బూడిద లారీలను అడ్డుకుని ధర్నాకు దిగారు. కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు.
గ్రామాలపైకి వెదజల్లుతున్న కాలుష్యం
ఎన్టీటీపీఎస్ కాలుష్యంతో పాటు అక్రమ బూడిద డంపింగ్ కేంద్రాలు, లారీల ద్వారా వెదజల్లే కాలుష్యం అనేక గ్రామాల పైకి చేరుతోంది. ముఖ్యంగా పశ్చిమ ఇబ్రహీంపట్నం, జూపూడి, కిలేశపురం, మూలపాడు గ్రామాల్లో బూడిద కాలుష్యం తీవ్రంగా ఉంది. సమీపంలోని బూడిద చెరువు నుంచి గాలి ద్వారా వ్యాపించే కాలుష్యంతో పాటు బూడిద లారీల రాకపోకలతో తీవ్రమైన కాలుష్యం వెదజల్లు తోంది. లోడింగ్‌తో వచ్చిన లారీలు హైవే మీద ఆపడం వలన నీటితో కలిసిన బూడిద రోడ్డుపై పడుతోంది. ఆరిన తర్వాత గాలికి లేచి ఇళ్లల్లోకి చేరుతోంది. ఇళ్లల్లో ప్లోరింగ్‌పై పౌడర్ మాదిరిగా పేరుకుపోయి ఇల్లంతా బూడిద మయంగా మారుతోంది. బూడిద కాలుష్యంతో ప్రజలు శ్వాస, చర్మ సంబంధిత వ్యాధుల బారిన పడుతున్నారు. ఇళ్లల్లోనే కాకుండా పచ్చని పంట పొలాలు సైతం బూడిద కాలుష్యం బారిన పడ్డాయి. కాలుష్యం సోకిన పొలాల్లో దిగుబడులు అంతంతమాత్రంగా ఉంటున్నాయి. కూరగాయలు రంగు మారడం వలన మార్కెట్‌లో ధర పతనమవుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఆందోళనకు దిగిన స్థానికులు
బూడిద కాలుష్య సమస్య భరించలేని స్థానికులు ఇటీవల రోడ్డెక్కారు. 65వ నంబర్ జాతీయ రహదారిపై బూడిద లారీలను అడ్డుకున్నారు. బూడిద లారీలు రోడ్డుపై ఆపడానికి వీల్లేదని పట్టుబట్టారు. ఎన్టీటీపీఎస్ అధికారులు, పోలీసులు అక్కడకు చేరుకుని ప్రజలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. కాలుష్య నివారణకు ఎటువంటి చర్యలు చేపడతారో చెప్పాలని ప్రజలు పట్టుబట్టగా, ఏమీ చెప్పలేక ఎన్టీటీపీఎస్ అధికారులు అక్కడి నుంచి జారుకున్నారు. పోలీసులు నచ్చచెప్పడంతో స్థానికులు ఆందోళన విరమించారు.
చర్మ రోగాలు సోకుతున్నాయి
ఎన్టీటీపీఎస్ నుంచి ఇళ్లల్లో చేరిన బూడిదతో డస్ట్ ఎలర్జీ, చర్మ సంబంధిత వ్యాధులు సోకుతున్నాయి. ఈ విషయం ఎవరూ పట్టించుకోవడం లేదు. ఒక్కోసారి రోడ్డు పక్కన కాలువల ద్వారా బూడిద నీరు ఇళ్లల్లోకి చేరుతున్నాయి. కాలుష్య నివారణకు తక్షణం చర్యలు చేపట్టాలి.
–షేక్ గాలిబ్ సాహీద్, పశ్చిమ ఇబ్రహీంపట్నం
తాగునీటిలో బూడిద
ఇటీవల కాలంలో తాగునీరులో బూడిద కలుస్తోంది. పైపులు లీకేజీ వలన నీటి కాలుష్యం జరుగుతోంది. బిందెల అడుగు భాగంలో బూడిద పేరుకుపోతోంది. ఎన్టీటీపీఎస్ అధికారులకు సమస్య వివరించినా ప్రయోజనం లేదు. తక్షణం తాగునీటి కాలుష్యం తగ్గించి స్వచ్ఛమైన జలాలు అందించాలి.
–పచ్చిగోళ్ల పండు, ఇబ్రహీంపట్నం
●
సీఎం చంద్రబాబు వద్దకు పంచాయితీ
అక్రమ బూడిద రవాణాలో ప్రజాప్రతినిధి వర్గం, కొండపల్లి మున్సిపాలిటీ పట్టణ టీడీపీ ఉపాధ్యక్షుడి వర్గం మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. పట్టణ ఉపాధ్యక్షుడి లారీలపై ప్రజాప్రతినిధి వర్గం కేసులు నమోదు చేయించడమే కాక, ఫోన్ చేసి దుర్భాషలాడి భయభ్రాంతులకు గురిచేశారు. ఈ విషయాన్ని పట్టణ ఉపాధ్యక్షుడి వర్గం సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లింది. ఇక్కడ జరుగుతున్న బూడిద అవినీతిలో ఓ సామాజిక వర్గం, ప్రజాప్రతినిధి పెత్తనం వివరిస్తూ వాట్సాప్ మెసేజ్ ద్వారా సీఎంకు చేరవేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఓ సామాజిక వర్గం కింద మిగిలిన సామాజిక వర్గాల వారు మానసికంగా నలిగిపోయి మనోవేదనకు గురవుతున్నట్లు ఆ మెసేజ్‌లో పేర్కొన్నారు. ఈ పంచాయితీ ఎటువైపు దారి తీస్తుందో వేచిచూడాలి.
బూడిదతో నిండిపోతున్న ఇళ్లు, పంట పొలాలు ఇటీవల రోడ్డెక్కి ఆందోళన చేసిన స్థానికులు కాలుష్య నివారణ చర్యలు చేపట్టకపోతే ఉద్యమ బాట సీఎం చంద్రబాబు దృష్టికి బూడిద పంచాయితీ
నా దగ్గరేముంది బూడిద అనే నానుడికి కాలం చెల్లింది. బూడిద ఇప్పుడు కూటమి ప్రభుత్వ నేతలకు ధనార్జన వస్తువుగా మారింది. అయితే ఆ ప్రాంత ప్రజల ఆరోగ్యాన్ని మాత్రం భస్మం చేస్తోంది. దీనిపై స్థానికులు ధర్నాలు, ఆందోళనలు చేసినా పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. చివరకు ఈ బూడిద పంచాయితీ సీఎం చంద్రబాబు దాకా వెళ్లింది.

కూటమి నేతలకు ధనార్జనే ధ్యేయం

కూటమి నేతలకు ధనార్జనే ధ్యేయం

కూటమి నేతలకు ధనార్జనే ధ్యేయం