
నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయండి
కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లా అభివృద్ధికి నియోజకవర్గాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో శనివారం సాయంత్రం 2047 విజన్ ప్రణాళికల తయారీపై నియోజకవర్గాల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర – 2047 విజన్ ప్రణాళిక అమలుకు జిల్లాలోని క్షేత్ర స్థాయి పరిస్థితులను, అవసరాలను పరిగణనలోకి తీసుకుని ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఆయా నియోజకవర్గాల రూపురేఖలు మార్చే విధంగా ఈ ప్రణాళికలు ఉండాలన్నారు. ప్రథమ, ద్వితీయ, తృతీయ రంగాలుగా గుర్తించిన వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈవో కన్నమనాయుడు, ఇన్‌చార్జ్ సీపీవో పద్మజ, డ్వామా పీడీ శివప్రసాద్‌యాదవ్, పశుసంవర్థక శాఖాధికారి చిననరసింహులు, డీఆర్డీఏ పీడీ హరిహరనాఽథ్, మార్క్‌ఫెడ్ డీఎం మురళీకిషోర్ తదితరులు పాల్గొన్నారు.
నీట్ పరీక్షలు కట్టుదిట్టంగా నిర్వహించండి
చిలకలపూడి(మచిలీపట్నం): ఈ నెల 4వ తేదీన జిల్లాలో జరగనున్న నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు లేకుండా కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్ నుంచి గూగుల్ మీట్ ద్వారా శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు. నీట్ పరీక్షలు ఆదివారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో జరుగుతాయన్నారు. మచిలీపట్నంలోని కేంద్రీయ విద్యాలయం, రుద్రవరంలోని కృష్ణా విశ్వవిద్యాలయంతో పాటు గన్నవరంలోని వీఎస్‌ఎస్‌టీ జాన్స్ హైస్కూల్‌లలో మూడు పరీక్ష కేంద్రాలు ఉన్నాయని, ఈ కేంద్రాల్లో పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు మచిలీపట్నం, గుడివాడ ఆర్డీవోలను నోడల్ అధికారులుగా, తహసీల్దార్లను సహాయ నోడల్ అధికారులుగా నియమించామన్నారు. జిల్లాలో 1096 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారన్నారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో ఉదయం 11 గంటలకు విద్యార్థులను లోనికి అనుమతించాలని, మధ్యాహ్నం 1.30 గంటలకు పరీక్ష కేంద్రం ద్వారాలను మూసివేయాలన్నారు. కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి నీట్ పరీక్షకు సంబంధించిన అధికారులు, సిబ్బంది, విద్యార్థులను మాత్రమే అనుమతించాలన్నారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు పరీక్ష కేంద్రాలను ముందు రోజు తనిఖీ చేసి నీట్ మార్గదర్శకాల ప్రకారం అన్ని ఏర్పాట్లు సజావుగా చేశారా, లేదా అనేది గమనించాలన్నారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు వెళ్లేందుకు వీలుగా ఆర్టీసీ బస్సులు నడపాలన్నారు. సమావేశంలో ఎస్పీ ఆర్.గంగాధరరావు, అదనపు ఎస్పీ వీవీ నాయుడు, డీఆర్వో కె.చంద్రశేఖరరావు, ఆర్డీవోలు కె.స్వాతి, జి.బాలసుబ్రహ్మణ్యం తదితర అధికారులు పాల్గొన్నారు.