
విజయవాడ కల్చరల్: శ్రీశ్రీ సాహిత్యం అనితర సాధ్యమని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ అన్నారు. ఎక్స్‌రే సాహిత్యసేవా సంస్థ ఆధ్వర్యంలో ఘంటసాల వెంకటేశ్వరరావు సంగీత కళాశాలలో గురువారం శ్రీశ్రీ 40 వ వర్ధంతి సభ, ప్రజానాట్యమండలి గౌరవ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వరరావుకు ఎక్స్‌రే శ్రీశ్రీ అవార్డు ప్రదానం, శ్రీశ్రీ సాహిత్య గ్రంథాల ఆవిష్కరణ సభ జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాణిక్యవరప్రసాద్ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో ప్రజల కోసం కలం పట్టిన వారు ఇద్దరు మాత్రమే కనిపిస్తారని చెప్పారు. అందులో ఒకరు జాషువా ఐతే మరొకరు శ్రీశ్రీ అని తెలిపారు. శ్రీశ్రీ కవిత్వం ద్వారా సమాజంలో మార్పులు తీసుకురావడానికి కృషి చేసినట్లు తెలిపారు. ఎక్స్‌రే సాహిత్యసేవా సంస్థ అధ్యక్షుడు కొల్లూరి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో విశేషమైన కృషి చేసిన వారిని ఏటా శ్రీశ్రీ పురస్కారంతో సత్కరిస్తునట్లు తెలిపారు. శ్రీశ్రీ సాహిత్యనిధి వ్యవస్థాపకుడు సింగంపల్లి అశోక్‌కుమార్ రచించిన ప్రత్యేక సంచిక, శ్రీశ్రీ సాహిత్యనిధి సంచికను నల్లూరి వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. సమావేశంలో గోళ్ళ నారాయణరావు, పొత్తూరి సీతారామారావు, అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి లక్ష్మీనారాయణ, విప్లవ రచయితల
సంఘం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ పాల్గొన్నారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్