
మహాజన సభలో మాట్లాడుతున్న కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): కేడీసీసీ బ్యాంక్ 42 శాతం వృద్ధితో రూ.10,150 కోట్లు వ్యాపారాన్ని దాటి దేశంలోనే అతి పెద్ద 5వ డీసీసీబీగా గుర్తింపు పొందిందని ఆ బ్యాంక్ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. గవర్నర్‌పేటలోని మాకినేని బసవపున్నయ్య హాల్లో కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు 108వ మహాజన సభ బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ సహకార సంఘాలు, రైతుల అభ్యున్నతికి కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. ఇందులో భాగంగా నష్టాల్లో ఉన్న 41 సంఘాలకు రూ. 6.66 కోట్ల వడ్డీ రాయితీని ప్రకటించినట్లు చెప్పారు. 20 నెలల కాలంలో 172 సహకార సంఘాల నూతన భవనాల మౌలిక వసతులకు రూ.42 కోట్ల రుణాలు, రూ. 2.38 కోట్ల గ్రాంటును మంజూరు చేశామన్నారు. సంఘంలో సభ్యుడైన రైతు మరణిస్తే మట్టి ఖర్చుల కింద రూ. 10 వేలు ఇస్తున్నామన్నారు. ఆ రైతు కేవలం రూ. 150 చెల్లిస్తే బ్యాంక్, సంఘం మరొక రూ. 225 కలిపి రూ. లక్ష బీమా చెల్లిస్తుందన్నారు. సహకార గృహ మిత్ర పథకం కింద రూ. 5 లక్షల వరకు రుణ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. డ్వాక్రా మహిళల కోసం ఎటువంటి ప్రాసెసింగ్ రుసుం లేకుండా రూ. 20 లక్షల వరకు రుణం మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. నూరు శాతం రుణాలు వసూలు చేసిన 6 సహకార సంఘాల అధ్యక్ష, కార్యదర్శులకు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. కేడీసీసీబీ డైరెక్టర్లు పడమట సుజాత, భూక్యా రాణి, ఎన్ కె ఎస్ ప్రకాష్‌రావు, కొమ్మినేని రవిశంకర్, గుడిదేశి పెద వెంకయ్య, గుమ్మడపు రవీంద్ర రాణా, సీఈవో శ్యామ్‌మనోహర్, జీఎంలు చంద్రశేఖర్, రంగబాబు, ఆప్కాబ్ జీఎం పిఎస్ మణి తదితరులు పాల్గొన్నారు.