
వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్ రంజిత్‌బాషా హాజరైన అధికారులు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఏప్రిల్ 3వ తేదీ నుంచి 18 వరకు నిర్వహించనున్న పదో తరగతి పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. జిల్లాలో పరీక్షల నిర్వాహణకు 154 కేంద్రాలు సిద్ధం చేశారు. ఈ ఏడాది మొత్తం 30,134 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరిలో 15,530 మంది బాలురు కాగా 14,604 మంది బాలికలు ఉన్నారు. రెగ్యులర్‌గా పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు 27,329, ప్రైవేటు విద్యార్థులు 2,805 మంది హాజరుకానున్నారు. పరీక్షల నిర్వహణపై బుధవారం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ ఢిల్లీరావు, డీఈఓ సీవీ రేణుకతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షెడ్యూల్ ప్రకారం జిల్లాలో పరీక్షలు నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని చెప్పారు. పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు 35 పోలీస్ స్టేషన్లను స్టోరేజ్ కేంద్రాలుగా గుర్తించామని పేర్కొన్నారు. పరీక్షల నిర్వహణకు ఇద్దరు అదనపు డిపార్ట్‌మెంట్ అధికారులను, ఐదు ఫైయింగ్ స్క్వాడ్లను, సి కేటగిరి కేంద్రాలకు ప్రశ్నపత్రాల పంపిణీకి 14 మంది రూట్ ఆఫీసర్లను నియమించామని తెలిపారు. ఏ, బీ కేంద్రాలకు 12 మంది రూట్ ఆఫీసర్లను అదనంగా మరో 12 మంది అసిస్టెంట్ రూట్ ఆఫీసర్లను నియమించినట్లు వెల్లడించారు. 1,354 ఇన్విజిలేటర్లను నియమించినట్లు వివరించారు. పరీక్షలు ముగిసిన మరుసటి రోజు నుంచి ఏప్రిల్ 26వ తేదీ వరకు స్పాట్ వాల్యూయేషన్ నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి బిషప్ అజరయ్య పాఠశాలను గుర్తించినట్లు చెప్పారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో జిరాక్స్ సెంటర్లను మూసివేసేలా చర్యలు తీసుకున్నామన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అవసరమైన బందోబస్తుని ఏర్పాటు చేయడంతో పాటు స్పాట్ వాల్యూయేషన్ కేంద్రం వద్ద 24 గంటలు పోలీస్ పహారా నిర్వహిస్తారన్నారు. ప్రశ్నపత్రాలను పరీక్ష కేంద్రాలకు చేరవేసేందుకు 12 క్లోజుడ్ కంటైనర్ వాహనాలను సిద్ధం చేశామన్నారు. పరీక్ష సమయాలలో నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని, విద్యార్థులు చదువుకునేందుకు వీలుగా రాత్రి వేళలో విద్యుత్ సరఫరా చేసేలా విద్యుత్ అధికారులను ఆదేశించిన్నట్లు తెలిపారు.
చిలకలపూడి(మచిలీపట్నం): జిల్లాలో పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించేలా పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ పి.రంజిత్‌బాషా అధికారులను ఆదేశించారు. సచివాలయం నుంచి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్, విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ బుధవారం జిల్లా కలెక్టర్‌తో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు.పదో తరగతి పరీక్షల నిర్వహణకు తీసుకున్న చర్యలను కలెక్టర్ వివరించారు. జిల్లాలో 391 హైసూళ్లకు చెందిన 22,436 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని చెప్పారు. 143 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్, 19 సిట్టింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అన్ని సౌకర్యాలు ఉండేలా చూడాలని డీఈవోకు కలెక్టర్ సూచించారు. పరీక్షల నిర్వహణలో ఏమైనా సమస్యలు ఎదురైతే వెంటనే వాటిని పరిష్కరించేందుకు కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఏఎస్పీ రామాంజనేయులు, డీఈవో తాహెరాసుల్తానా, డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్ గీతాబాయి, ఆర్టీసీ డిపో మేనేజర్ టి.పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు.
ఏప్రిల్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జిల్లాలో 154 కేంద్రాల ఏర్పాటు హాజరుకానున్న 30,134 మంది విద్యార్థులు

మాట్లాడుతున్న కలెక్టర్ ఢిల్లీరావు, పక్కన డీఈఓ సీవీ రేణుక