వినతులిచ్చి.. గోడు చెప్పుకుని | - | Sakshi
Sakshi News home page

వినతులిచ్చి.. గోడు చెప్పుకుని

Apr 14 2026 7:28 AM | Updated on Apr 14 2026 7:28 AM

● కలెక్టరేట్‌లో ప్రజవాణికి తరలివచ్చిన బాధితులు

ఆసిఫాబాద్‌: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ ప్రాంతాల నుంచి బాధితులు తరలివచ్చారు. అధికారులకు వినతిపత్రాలు అందించి.. తమ గోడు చెప్పుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరిస్తామని కలెక్టర్‌ డేవిడ్‌ అన్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలోని నూర్‌నగర్‌కు చెందిన సాజిదా బేగం, వాంకిడి మండల కేంద్రానికి చెందిన సంధ్యారాణి వేర్వేరుగా దరఖాస్తు చేసుకున్నారు. కెరమెరి మండలం ముకద్దంగూడకు చెందిన రాథోడ్‌ మనిషా గత సర్పంచ్‌ ఎన్నికలో పోటీ చేసిన పత్రాలు తిరిగి ఇవ్వాలని కోరింది. తనకు అనువంశికంగా సంక్రమించిన భూమిని కొంతమంది దౌర్జన్యంగా కబ్జా చేశారని, విచారణ జరిపి న్యాయం చేయాలని ఆసిఫాబాద్‌ మండలం సాలెగూడకు చెందిన ముంజం బాగుబాయి కోరింది. తమ గ్రామంలోని బాగున్న సీసీ రోడ్డుపై అనవసరంగా మరో సీసీ వేస్తున్నారని, విచారణ చేపట్టాలని కెరమెరి మండలం మహరాజ్‌గూడకు చెందిన రాథోడ్‌ విజయ్‌ ఫిర్యాదు చేశాడు. వ్య వసాయ భూమిలో బోరుబాయి వేయించాలని ఆసిఫాబాద్‌ మండలం అంకుసాపూర్‌కు చెందిన దుర్గం హొక్కు దరఖాస్తు చేసుకున్నాడు. ప్రజాపాలన కార్యక్రమంలో ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాలేదని, ఇప్పటికైనా తనకు ఇల్లు మంజూరు చేయాలని ఆసిఫాబాద్‌ మండలం ఇప్పలనవగాంకు చెందిన మహమ్మద్‌ దరఖాస్తు చేసుకున్నాడు. కార్యక్రమంలో వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.

తప్పుడు సమాచారం నమోదైంది

నా భర్త రాజు 13 ఏళ్లక్రితం గుండెపోటుతో మరణించారు. నాకు కుమార్తె ఉంది. జిల్లా కేంద్రంలోని బజార్‌వాడిలో ఇంటి నం.3–399/1/ఏ/1లో ఒక గుడిసెలో నివాసం ఉంటున్నాను. కుట్టుపని చేసుకుని బతుకుతున్నా. ఇందిరమ్మ ఇళ్ల సర్వే సమయంలో నా నివాస స్థితి తప్పుగా నమోదైంది. ఆర్సీసీ ఇంట్లో అద్దెకు ఉంటున్నట్లు తప్పుడు సమాచారం నమోదు చేశారు. నా దరఖాస్తు స్టేటస్‌ను సరిచేసి లిస్టు– 3 నుంచి లిస్టు– 1కు ఇల్లు మంజూరు చేయాలి. – గంగిశెట్టి సువర్ణ, ఆసిఫాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement