శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు
రెబ్బెన(ఆసిఫాబాద్): ఎన్నికల అనంతరం విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని, ఎవరైన శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే చర్యలు తప్పవని మల్టీజోన్– 1 ఐజీ చంద్రశేఖర్‌రెడ్డి హెచ్చరించారు. రెబ్బెన మండలం గోలేటి టౌన్‌షిప్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను బుధవారం సందర్శించారు. భద్రత చర్యలు, పోలింగ్ సిబ్బంది విధుల నిర్వహణ, పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకుంటున్న చర్యలను పరిశీలించారు. ఎన్నికలు ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు సూచనలు అందించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏఎస్పీ చిత్తరంజన్, సీఐ సంజయ్, పోలీస్ సిబ్బంది ఉన్నారు.


