 
															మోంథా.. రైతుల గుండెకోత
కౌటాల: కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన తంగాడే మహేశ్వర్ మూడెకరాల్లో వరి సాగు చేశాడు. నాలుగు రోజుల క్రితం కూలీలతో పంట కోశాడు. తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు కోసిన వరి మొత్తం తడిసింది. పొలంలోకి వరద చేరడంతో గురువారం ఉదయం వరి కుప్పలను ఎత్తి గట్లపై పెట్టారు. జిల్లాలోని పలు మండలాల్లో రైతులు అకాల వర్షాలతో ఇలా ఇబ్బందులు పడుతున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్: అన్నదాతల ఆశలపై మోంథా తుపాను నీళ్లు చల్లింది. బుధవారం సాయంత్రం నుంచి గురువారం తెల్లవారుజాము వరకు జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పంటలు చేతికందే దశలో వర్షాలకు పత్తి, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఈ వానాకాలం సీజన్‌లో అత్యధికంగా 3,35,363 ఎకరాల్లో పత్తి సాగు చేయగా, 56,861 ఎకరాల్లో వరి, 30,430 ఎకరాల్లో కంది పంట సాగవుతోంది. దీపావళి పండుగ తర్వాతే చాలామంది రైతులు పత్తితీత పనులు ప్రారంభించారు. సీసీఐ కేంద్రాలు ప్రారంభించకపోవడంతో కొందరు ఇంకా మొదలుపెట్టలేదు. ఈ క్రమంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో పత్తికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చినుకులకు రంగుమారితే మద్దతు ధర దక్కడం కష్టమని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నేలవాలుతున్న వరి
ఎడతెరిపి లేని వర్షాలకు కోతకు వచ్చిన వరిపైరు పొలంలో నేలవాలుతోంది. కొన్నిచోట్ల గింజలు మొలకలు వస్తున్నాయి. ముఖ్యంగా దహెగాం, పెంచికల్‌పేట్ మండలాల్లో వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. పొలంలో వరద నీళ్లు నిల్వ ఉండటంతో కోతలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. బురదతో రైతులపై అదనపు భారం పడనుంది.
46.8 మి.మీ.ల సగటు వర్షపాతం నమోదు
జిల్లాలో బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి గురువారం ఉదయం 8.30 గంటల వరకు 46.8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సిర్పూర్(యూ)లో 64.8 మి.మీ.ల వర్షపాతం నమోదు కాగా, తిర్యాణిలో 42.2 మి.మీలు, ఆసిఫాబాద్ 30.2, కాగజ్‌నగర్ 49.4, కౌటాల 42.8, జైనూర్ 62.0, లింగాపూర్ 38.0, కెరమెరి 63.2, వాంకిడి 62.8, సిర్పూర్(టి) 60.6, చింతలమానెపల్లి 48.0, పెంచికల్‌పేట్ 30.4, దహెగాం 28.6, బెజ్జూర్ 34.2, రెబ్బెనలో 44.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.
అడ ప్రాజెక్టు గేటు ఎత్తివేత
కుమురంభీం(అడ) ప్రాజెక్టులోకి వరద చేరుతోంది. గురువారం ఇన్‌ఫ్లో 2,810 క్యూసెక్కులు ఉండగా, ఐదో గేటును 0.2 మీటర్లు పైకెత్తి 2,116 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 237.6 మీటర్ల వరకు నీటి మట్టం ఉండగా, 5.7 టీఎంసీల నీటి నిల్వ ఉంది.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
