 
															బల్దియాల అభివృద్ధికి నిధులు!
కాగజ్‌నగర్‌టౌన్: జిల్లాలోని రెండు మున్సిపాలిటీల్లో పాలక వర్గాల పాలన ముగిసిపోవడంతో ప్రస్తు తం ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. సరిపడా నిధులు లేకపోవడంతో పట్టణాలు సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఈ నేపథ్యంలో బల్దియాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. తెలంగాణ రైజింగ్ విజన్– 2047లో భాగంగా మున్సిపాలిటీల అభివృద్ధికి యూఐడీఎఫ్ ద్వారా నిధులు మంజూరు చేసేందుకు సిద్ధమైంది.
రోడ్లు, డ్రెయినేజీలపై ఫోకస్
మేజర్ గ్రామ పంచాయతీ నుంచి నూతనంగా ము న్సిపాలిటీగా ఏర్పాటైన ఆసిఫాబాద్‌కు రూ.15 కో ట్లు, కీలకమైన కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి రూ. 18.70 కోట్లు మంజూరు చేసే అవకాశం ఉంది. నిధులతో రోడ్లు, డ్రెయినేజీల అభివృద్ధితోపాటు ప్రధాన చౌరస్తాల విస్తరణ పనులు చేపట్టనున్నారు. ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఆయా పనులకు సంబంధించి అంచనాలు సిద్ధం చేశారు. యూఎఫ్ ఐడీసీ ద్వారా రుణం రూపంలో నిధులు అందించనున్నట్లు తెలుస్తోంది. కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ బల్దియాలకు కలిపి రూ.33.70 కోట్ల నిధులకు అంచనాలను రూపొందించారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌గాంధీ చౌరస్తా నుంచి హరీ ద్వార్ లాడ్జి మీదుగా సంజీవయ్య కాలనీ వరకు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అలాగే సర్‌సిల్క్‌లోని పోచమ్మ ఆలయం నుంచి డాడానగర్ చౌరస్తా వరకు సీసీ రోడ్డు, బాలాజీనగర్ బోర్డు నుంచి శ్రీరాంనగర్ మీదుగా కౌసర్‌నగర్ వరకు రోడ్డు, శ్రీరాంనగర్ నుంచి బ్రాహ్మణవాడ మీదుగా శంకర్ సైకిల్ షాపు వరకు రోడ్డు, ఆదర్శనగర్‌లోని పార్కులో సౌకర్యాల కల్ప న, పర్దాన్‌గూడ ప్రధాన రోడ్డు నుంచి డంపింగ్ యార్డు వరకు సీసీరోడ్డు, కాపువాడలో మసాలవాగు వరకు శాశ్వత ప్రధాన కాలువ నిర్మాణం, తెలంగాణ తల్లి చౌరస్తా, శివాజీ చౌరస్తా, రాజీవ్‌గాంధీ చౌరస్తా, విజయబస్తీ చౌరస్తాల సుందరీకరణతోపాటు 30 వార్డుల్లో అవసరమైన చోట డ్రెయినేజీలు, అంతర్గత రహదారులు నిర్మించనున్నారు.
పెరుగుతున్న జనాభా
కాగజ్‌నగర్ పట్టణంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభా, వాహనాలతో రోడ్లు సరిపోవడం లేదు. 1999– 2000లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ఆధారంగానే నిర్మాణాలు సాగుతున్నాయి. ప్రధాన రహదారుల విస్తరణ చేపట్టడం లేదు. అంతర్గత రోడ్లు సైతం అధ్వానంగా మారాయి. గుంతలతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మార్కెట్ ఏరియాలో వాహనాలు పార్కింగ్ చేసేందుకు సరిపడా స్థలం లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
పనులు చేపడతాం
కాగజ్‌నగర్ పట్టణాన్ని ప్రగతి పథకంలోకి తీసుకెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ అమలుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రస్తుతం బల్దియా అభివృద్ధికి రూ.15 కోట్ల అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాగానే విడతలవారీగా అభివృద్ధి పనులు చేపడుతాం. రోడ్లు, డ్రెయినేజీలు, ప్రధాన చౌరస్తాలను విస్తరించేందుకు తొలి ప్రాధాన్యత ఇస్తాం.
– రాజేందర్,
మున్సిపల్ కమిషనర్, కాగజ్‌నగర్

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
