ఇందిరమ్మ ఇళ్లతో ‘ఉపాధి’ | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ ఇళ్లతో ‘ఉపాధి’

Oct 31 2025 7:51 AM | Updated on Oct 31 2025 7:51 AM

ఇందిరమ్మ ఇళ్లతో ‘ఉపాధి’

ఇందిరమ్మ ఇళ్లతో ‘ఉపాధి’

లబ్ధిదారులు ఈజీఎస్‌ను వినియోగించుకునే అవకాశం 90 రోజులపాటు పనిదినాలు నేరుగా ఖాతాల్లోనే నగదు జమ

తిర్యాణి(ఆసిఫాబాద్‌): ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకానికి రాష్ట్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకాన్ని అనుసంధానం చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధిహామీలో పథకంలో భాగంగా తమ సొంతింటి నిర్మాణ పనులను చేసిన లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా ఈజీఎస్‌ నిధుల ద్వారా డబ్బులు జమ చేయనున్నారు.

90 రోజులపాటు పనులు

జిల్లాలో రెండు విడతల్లో 8,147 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 6,167 ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. అలాగే జిల్లాలోని 1.23 లక్షల ఉపాధిహామీ జాబ్‌కార్డుల్లో 91వేలు యాక్టీవ్‌ కార్డులు ఉన్నాయి. మొత్తం 2.43 లక్షల మంది కూలీల్లో యాక్టీవ్‌ కూలీలు 1.70 లక్షల మంది ఉన్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా ఉపాధిహామీ కింద బేస్మెంట్‌ వరకు 40 రోజులు, పైకప్పు వరకు 50 రోజులు మొత్తంగా 90 రోజులపాటు లబ్ధిదారులు పనులు చేసుకోవచ్చు. ఉపాధి హామీ పథకంలో సాధారణంగా ఒక్కో కుటుంబానికి 100 రోజుల పనిదినాలు కల్పిస్తారు. ఒకవేళ సదరు కుటుంబం ఇప్పటికే 20 నుంచి 30 పనిదినాలు పూర్తిచేసి ఉంటే.. వీరు ఇంటి నిర్మాణంలో భాగంగా చేసే పని దినాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలోని రోజులను లెక్కించనున్నారు. కూలీలకు ప్రతీరోజు సగటున రూ.307 గరిష్ట వేతనం అందుతుండగా.. 90 రోజులకు రూ.27,630 వరకు నిధులు ఉపాధి నిధులు అందే అవకాశం ఉంది. ఇప్పటికే రెండు దశల్లో ఎంపిక చేసిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు జాజ్‌కార్డు లేకుంటే కొత్తగా దరఖాస్తులు స్వీకరించి వెంటనే మంజూరు చేస్తున్నారు. వీటితోపాటు స్వచ్ఛ భారత్‌ మిషన్‌(ఎస్బీఎం) కింద రూ.12 వేలను మరుగుదొడ్ల నిర్మాణం కోసం అందించనున్నారు. మొత్తంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు రూ.39 వేల వరకు అందనుంది. అయితే ఈ మొత్తం ప్రభుత్వం అందించే రూ.5 లక్షల్లోనే భాగమవుతుందని అధికారులు చెబుతున్నారు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉపాధిహామీ పనులు అమలు కావడం లేదు. ఆయా ప్రాంతాల్లోని లబ్ధిదారులకు ఉపాధిహామీ నిధులను ఏ విధంగా చెల్లిస్తారనే దానిపై ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టతనివ్వలేదు.

జీ+1 తరహా ఇళ్ల నిర్మాణానికి అవకాశం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం కనీసం 400 చదరపు అడుగులు, గరిష్టంగా 600 చదరపు అడుగులు ఉండాలనే నిబంధన విధించింది. దీంతో ఇరుకు స్థలాల్లో నివసిస్తున్న పేదలకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వం కొన్ని సడలింపులు ఇచ్చింది. జీ+1 తరహాలో ఇంటి నిర్మాణం చేసుకునేందుకు అవకాశం కల్పిస్తూ జీవో విడుదల చేసింది. దీని ప్రకారం కనీస కార్పెట్‌ ఏరియా 323 చదరపు అడుగులు ఉండాలని పేర్కొంది. వీటితోపాటు నిర్మాణంలో తప్పనిసరిగా కిచెన్‌, బాత్రూం, టాయిలెట్‌ ఉండాలని జీవోలో సృష్టం చేసింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో రూప్‌ నిర్మించాక రూ.లక్ష, మొదటి అంతస్తు రూఫ్‌ లెవల్‌ వరకు కాలమ్స్‌ నిర్మించిన తర్వాత మరో రూ.లక్ష, గోడలు పూర్తయిన తర్వాత రూ.2 లక్షలు, నిర్మాణం పనులు పూర్తయిన తర్వాత మిగిలిన రూ.లక్ష నగదును విడుదల చేయనున్నారు.

కొత్త కార్డులు మంజూరు చేస్తున్నాం

ఇందిరమ్మ ఇళ్లు మంజూరై జాబ్‌కార్డు లేని వారిని గుర్తించి వారికి త్వరితగతిన నూత న జాబ్‌ కార్డులు మంజూరు చేస్తున్నాం. ఉపాధిహామీ అనుసంధానంలో భాగంగా 90 రోజుల పనిదినాలను లబ్ధిదారులకు కల్పిస్తున్నాం. వీటితో ఎస్బీఎం పథకం కింద మరో రూ.12 వేల నిధులను మరుగుదొడ్డి నిర్మాణం కోసం అందిస్తున్నాం.

– దత్తారావు, డీఆర్‌డీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement