స్వచ్ఛ పాఠశాలలే లక్ష్యంగా..
కెరమెరి(ఆసిఫాబాద్): రోజుకో వినూత్న కార్యక్రమాలతో రాష్ట్ర విద్యాశాఖ ముందుకు సాగుతోంది. విద్యార్థులకు చదువే కాదు.. పాఠశాలల పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రత్యేక శద్ధ తీసుకునేలా చర్యలు చేపడుతోంది. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 17నుంచి స్వచ్ఛతాపక్వాడా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ప్రస్తుతం జిల్లాలోని అన్ని (స్థానిక సంస్థల) జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలల్లో కార్యక్రమం ప్రారంభమైంది. ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు కలిసి ఈ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంది. ఈ నెల 31వరకు కొనసాగే ఈ కార్యక్రమం రోజుకో తీరుగా కొనసాగనుంది.
ఎంఈవోల పర్యవేక్షణలో..
స్వచ్ఛతాపక్వాడా కార్యక్రమాలు ఎంఈవోల పర్యవేక్షణలో కొనసాగుతాయి. పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తూ.. పాఠశాల ఆవరణను పరిశుభ్రంగా ఉంచుకుంటూ.. ‘మన పాఠశాల.. మ న బాధ్యత’ అనే సందేశాన్ని ఇవ్వడమే ఈ కార్యక్రమ లక్ష్యం. పరిశుభ్రత, పచ్చదనం, విద్యార్థుల చురుకుదనం ఆధారంగా చివరలో అత్యుత్తమ పాఠశాలలను ఎంపిక చేసి ‘స్వచ్ఛ పాఠశాల పురస్కా రం’ అందించనున్నారు. ఇప్పటికే విద్యార్థులతో స్వచ్ఛత ప్రతిజ్ఞ, క్లీన్ ఇండియా, బ్యూటీఫుల్ ఇండియా అంటూ నినాదాలు చేయించారు. పాఠశాలల్లో నిర్వహించిన కార్యక్రమాలను ప్రధానోపాధ్యాయులు డాక్యుమెంటేషన్ చేసి జిల్లా కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
రోజువారీ కార్యక్రమాలివే..
18, 21న: పరిసరాల పరిశుభ్రతపై అవగాహన.
22న: హరిత దినోత్సవం నిర్వహించాలి. విద్యార్థులతో మొక్కలు నాటించాలి.
23న: పాఠశాలను సమాజానికి చేరువ చేయాలి. స్థానికులు, విద్యావేత్తలతో విద్యార్థులను మమేకం చేయాలి. స్వచ్ఛత ప్రాముఖ్యత గురించి వివరంగా తెలియజేయాలి.
24న: హ్యాండ్ వాషింగ్ డేలో భాగంగా విద్యార్థులకు చేతులు శుభ్రం చేసే విధానాలను నేర్పించాలి.
25న: స్వచ్ఛతపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు నిర్వహించాలి.
27న: వ్యక్తిగత పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహించాలి. విద్యార్థులకు వ్యక్తిగత ఆరోగ్య పరిశుభ్రతపై అవగాహన కల్పించాలి.
28న: పాఠశాల స్థాయిలో స్వచ్ఛతపై ఎగ్జిబిషన్ డే నిర్వహించాలి.
29, 30న: ఉపాధ్యాయులు విద్యార్థులతో స్వచ్ఛతపై ప్రణాళిక, కార్యాచరణ విధానాన్ని సిద్ధం చేయాలి.
31న: చివరిరోజు ప్రముఖులను ఆహ్వానించాలి. ఆయా పోటీల్లో విజేతలుగా నిలిచినవారికి బహుమతులు అందజేయాలి.


