
గణేశ్ నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించే గణేశ్ నిమజ్జనానికి పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పెద్దవాగు వద్ద గణేశ్ నిమజ్జన ప్రాంతాన్ని గురువారం పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఉత్సవాలను అన్నిశాఖల సమన్వయంతో పకడ్బందీగా నిర్వహిస్తామన్నారు. నిమజ్జన ఘాట్ల వద్ద ట్రాఫిక్, ఇతర డ్యూటీల కోసం 600 మంది పోలీసులను బందోబస్తు కోసం నియమించామన్నారు. సీసీ కెమెరాలు, బోట్లు, డీడీఆర్‌ఎఫ్ బృందం, గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచామని తెలిపారు. మద్యం తాగి వేడుకల్లో పాల్గొనవద్దన్నారు. మండపాల నిర్వాహకులు, భక్తులు విద్యుత్‌పై ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలన్నారు. ఎలాంటి సమస్యలు ఎదురైనా పోలీసులను తక్షణమే సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట సీఐ బాలాజీ వరప్రసాద్, ఎస్సై ఉదయ్‌కిరణ్, మున్సిపల్ కమిషనర్ గజానంద్, సిబ్బంది ఉన్నారు.