
ఉపాధికి ఊతం!
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: హాజీపూర్ మండలం వేంపల్లిలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రీయల్ పార్క్ కొత్త పరిశ్రమల స్థాపనకు, ఉపాధి అవకాశాల సృష్టికి ఊతమివ్వనుంది. ఆదివారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు, స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఈ పార్కుకు శంకుస్థాపన చేయనున్నారు.
ఎమ్మెల్యే చొరవతో..
మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని హాజీపూర్ మండలం వేంపల్లి, పోచంపాడు శివారులో 250 ఎకరాల్లో ఇండస్ట్రీయల్ పార్క్ ఏర్పాటు కానుంది. ఈ పార్క్ కోసం రైతుల నుంచి భూములు సేకరించి పరిహారం చెల్లించారు. స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు ఇందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నిర్మాణ పనులూ వేగవంతమవుతున్నాయి. వ్యవసాయ ఆధారిత, అనుబంధ రంగ, తయారీ, శీతల గిడ్డంగులు, పశు, పౌల్ట్రీ, పాల ఆధారిత పరిశ్రమలతోపాటు ఐటీ కంపెనీల కోసం ఐటీ హబ్‌ను సైతం ఏర్పాటు చేయనున్నారు.
సబ్సిడీలు, సౌకర్యాలు..
ఇండస్ట్రీయల్ పార్కులో పరిశ్రమలు స్థాపించే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సబ్సిడీలు, ప్రోత్సాహకాలు అందిస్తుంది. రూ.కోటి నుంచి రూ.100 కోట్ల వరకు పెట్టుబడులతో పరిశ్రమల స్థాపనకు సౌకర్యాలు కల్పించనున్నారు. రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, రవాణా వంటి మౌలిక సదుపాయాలతోపాటు విద్యుత్ సబ్సిడీలు, రాయితీలు, రుణ సౌకర్యాలను అందించనున్నారు. జాతీయ రహదారి 63, మంచిర్యాల రైల్వే స్టేషన్ సమీపంలో ఉండడం, పెద్దపల్లి జిల్లాలో ప్రతిపాదిత విమానాశ్రయం వంటి రవాణా సౌకర్యాలు ఈ పార్క్‌ను ఆసిఫాబాద్, మహారాష్ట్ర, పెద్దపల్లి జిల్లాలకు అనుసంధానిస్తాయి.
శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు స్థానిక ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఆదివారం మంచిర్యాల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. లక్సెట్టిపేట, దండేపల్లి, హాజీపూర్ మండలాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారు. లక్సెట్టిపేటలో ఆస్పత్రి భవనం ప్రారంభోత్సవం, జూనియర్ కాలేజీ, హైస్కూల్ విద్యార్థులతో భోజనం, దండేపల్లి మండలం రెబ్బెనపల్లిలో ఇందిరా మహిళా శక్తి సౌర విద్యుత్ ప్రాజెక్టుకు భూమిపూజ చేస్తారు. అనంతరం అక్కడే నిర్వహించే బహిరంగ సభలో మాట్లాడతారు. తర్వాత వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ మెడికల్ కాలేజీ, ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారు.
వేంపల్లిలో ఇండస్ట్రీయల్ పార్కు..
నేడు శంకుస్థాపన చేయనున్న డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు
జిల్లా అభివృద్ధికి మరో అడుగు
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మేలు