
అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తప్పవు
● ఎస్పీ డీవీ.శ్రీనివాస్ రావ్
ఆసిఫాబాద్‌అర్బన్: సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు, ఇతరులను కించపర్చేలా పోస్టులు చేస్తే గ్రూప్ అడ్మిన్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ డీవీ శ్రీనివాస్ రావ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని పోలీసు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్‌లో బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫిర్యాదులపై తక్షణమే స్పందిస్తూ వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత స్టేషన్‌ల ఎస్సై, సీఐలతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సోషల్ మీడియాలో అనవసర విషయాలను, రాజకీయ నాయకుల, కులమతాల మధ్య చిచ్చుపెట్టే అంశాలను, ఇతరుల మనోభావాలను కించపర్చేలా పోస్టులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
పదోన్నతితో గుర్తింపు
పోలీసు శాఖలో పదోన్నతి పొందడం ద్వారానే గుర్తింపు లభిస్తుందని ఎస్పీ డీవీ శ్రీనివాసరావ్ అన్నారు. ఆసిఫాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న హెడ్ కానిస్టేబుల్ మీర్ ఉస్మాన్ అలీ, కౌటాల హెడ్ కానిస్టేబుల్ బాబాజీకి ఏఎస్సైలుగా పదోన్నతి లభించడంతో సోమవారం తన కార్యాలయంలో చిహ్నం అలంకరించి వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ ఎంటీవో అంజన్న, సీసీ కిరణ్, తదితరులు పాల్గొన్నారు.