
పులులకు రక్షణ కరువు
● కాగజ్‌నగర్ డివిజన్‌లో టైగర్ల హతం ● విద్యుత్ తీగలు, విషప్రయోగంతో వేట ● సంరక్షణలో అటవీఅధికారుల విఫలం ● తాజాగా ఎల్లూర్ అడవిలో పులి హతం
పెంచికల్‌పేట్: జిల్లాలోని కాగజ్‌నగర్ డివిజన్‌లో పులులకు రక్షణ కరువైంది. గతేడాది జనవరిలో కా గజ్‌నగర్ రేంజ్ పరిధిలోని దరిగాం అటవీ ప్రాంతంలో కే15, ఎస్9 అనే పెద్ద పులులను విషప్రయోగంతో హతమార్చడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచల నం రేపింది. తాజాగా పెంచికల్‌పేట్ రేంజ్ పరిధి లోని ఎల్లూర్ అటవీ ప్రాంతంలో వేటగాళ్ల విద్యుత్ తీగలకు పెద్దపులి మృతి చెందడంతో అటవీ అధికా రుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోంది.
పెంచికల్‌పేట్ రేంజ్‌లో..
పెంచికల్‌పేట్ రేంజ్‌లో రెండు నెలలుగా వన్యప్రాణుల వేట యథేచ్ఛగా సాగుతోంది. వేసవి నేపథ్యంలో దాహంతో అటవీ ప్రాంతం నుంచి బయటకు వస్తున్న వన్యప్రాణులను వేటగాళ్లు విద్యుత్ తీగలు అమర్చి హతమారుస్తున్నారు. మార్చిలో నందిగామ, అగర్‌గూడ, లోడుపల్లి, కొండపల్లి గ్రామాల్లో విద్యుత్ తీగలు అమర్చి నీలుగాయి, చుక్కల దుప్పిని వేటాడిన 11 మందిని పక్కా సమాచారంతో అటవీశాఖ అధికారులు అరెస్ట్ చేశారు.
ఒకచోట నుంచి మరొక చోటికి ఎలా?
తునికాకు సేకరించటానికి వెళ్లిన కూలీలు ఇచ్చిన స మాచారంతో సిబ్బంది పులి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. రిజర్వ్ ఫారెస్టులో అచేతనంగా పడి ఉ న్న పులి తెల్లవారేసరికి ఘటనా స్థలానికి సుమారు 400మీటర్ల దూరంలో ఒర్రెలో పాతిపెట్టిన స్థలాన్ని అధికారులు గుర్తించడం అనుమానాలకు తావిస్తోంది. పాతిపెట్టిన పులి చర్మం, గోర్లు, మీసాలు, దంతాలు లేక పోవడంతో ముఠా పక్కగా హతమార్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనా ప్రాంతానికి దగ్గరలోనే పంట పొలాల్లో ఉన్న విద్యుత్ తీగలతో హతమార్చారు.
అదుపులో అనుమానితులు
వేటగాళ్ల విద్యుత్ తీగలకు పులి మృతి చెందడంతో ఈ నెల 17న ఉదయం పెంచికల్‌పేట్, ఎల్లూర్, కోయచిచ్చాల, కొత్తగూడ, అగర్‌గూడ గ్రామాలకు చెందిన సుమారు 30మందిని అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని కాగజ్‌నగర్, పెంచికల్‌పేట్ రేంజ్‌లో విడివిడిగా విచారణ చేస్తున్నారు. పులుల సంరక్షణలో వైఫల్యమైన అధికారులు అమాయకులను అదుపులోకి తీసుకుని వేధిస్తున్నారని వారి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..
పెద్దపులి మృతి విషయంలో అటవీశాఖ అధికారులు గోప్యత పాటించారు. ఈనెల 14న ఉదయం అగర్‌గూడ గ్రామానికి చెందిన మహిళలు తునికాకు సేకరణకు ఎల్లూర్ అటవీ ప్రాంతానికి వెళ్లారు. ఆకు సేకరిస్తున్న క్రమంలో అచేతనంగా పడి ఉన్న పెద్దపులిని చూసి పరుగులు పెట్టారు. విషయాన్ని ఆలస్యంగా అటవీశాఖ అఽధికారులకు తెలిపారు. 15న అక్కడికి వెళ్లిన అటవీశాఖ అధికారులకు పులి ఆచూకీ లభించలేదు. 16న మధ్యాహ్నం 2గంటల ప్రాంతంలో ఒర్రెలో వన్యప్రాణి చనిపోయిన ఆనవాళ్లు గు ర్తించిన అధికారులు ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. ఎఫ్‌డీపీటీ శాంతారాం, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ టోబ్రివాల్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. 17న ఉదయం 6గంటలకు డీఎఫ్‌వో నీరజ్‌కుమార్ ఆధ్వర్యంలో పాతి పెట్టిన వన్యప్రాణి కళేబరాన్ని బయటకు తీశారు. వెటర్నరీ డాక్టర్ల బృందం రాకేశ్, శ్రీకాంత్, విజయ్ కళేబరానికి ప్రిమార్టం, పోస్టుమార్టం నిర్వహించారు. పోస్టుమార్టంలో చనిపోయింది సుమారు ఏడేండ్ల వయస్సున్న ఆడపులిగా ప్రాథమికంగా నిర్ధారించారు. పులిని హతమార్చిన తర్వాత గోర్లు, చర్మం, మీసాలు, దంతాలను వేటగాళ్లు అపహరించారు. కళేబరం నుంచి కాలేయాన్ని సేకరించి సీసీఎంబీ ల్యాబ్‌కు పరీక్షల కోసం తరలించారు. పోస్టుమార్టం అనంతరం కళేబరాన్ని అక్కడే దహనం చేశారు. ఘటన జరిగిన ప్రాంతానికి వెళ్లిన మీడియాను అడ్డుకున్నారు.