
బాల్య వివాహాలను ప్రోత్సహించొద్దు
ఆసిఫాబాద్‌రూరల్: బాల్య వివాహం చట్టరీత్యా నేరమని జిల్లా బాలల సంరక్షణాధికారి బూర్ల మహేశ్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని రహపల్లి గ్రామంలో బాల్యవివాహం నిశ్చయించినట్లు వచ్చి న సమాచారం మేరకు సిబ్బందితో వెళ్లి కుటుంబ సభ్యులు, గ్రామస్తులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 18 ఏళ్ల తరువాతే వివాహం చేయాలని, ముందే వివాహం చేస్తే నేరమవుతుందని పేర్కొన్నారు. బాల్య వివాహాలతో కలిగే నష్టాలను వివరించారు ఎక్కడైనా బాల్య వివాహం చేస్తున్నట్లు తెలిస్తే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 లేదా 112 టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన 2030 నాటికి బాల్య వివాహ రహిత భారత్ లక్ష్యంగా పని చేస్తున్నామని తెలిపారు. సోషల్ వర్కర్ ప్రవీణ్‌కుమార్, చైల్డ్ హెల్ప్‌లైన్ కోఆర్డినేటర్ కుమార్, కౌన్సిలర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.