
విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి
● కలెక్టర్ వెంకటేష్ దోత్రే
వాంకిడి: విద్యార్థులు అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలని కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సమ్మర్ క్యాంపులో విద్యార్థులు నేర్చుకున్న విద్యా సామార్థ్యాలను, కళా నైపుణ్యాలను పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్యాంపులో నేర్చుకున్న విషయాలను ఇక్కడితో వదిలేయకుండా ఇళ్లలో కూడా కొనసాగించాలన్నారు. చిత్ర లేఖనం, యోగా, కరాటే, నృత్యం, స్పోకెన్ ఇంగ్లిష్, తదితర అంశాలపై జిల్లా స్థాయిలో పోటీలు నిర్వహించి ప్రతీ కేటగిరీ నుంచి ఉత్తమ ప్రతిభ కనబర్చిన ముగ్గురిని కలెక్టరేట్‌లో సన్మానించడంతో పాటు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. పాఠశాల వయస్సులో నేర్చుకున్న కళా నైపుణ్యాలు దీర్ఘకాలం గుర్తుండిపోతాయన్నారు. అంతకు ముందు విద్యార్థినులు ప్రదర్శించిన నృత్యం చూపరులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ క్వాలిటీ కోఆర్డినేటర్ శ్రీనివాస్‌రావు, ఎంఈవో శివచరణ్ కుమార్, ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రావణ్ కుమార్, ప్రధానోపాధ్యాయుడు నటరాజ్, తదితరులు పాల్గొన్నారు.
సభాస్థలి ఏర్పాట్లు పరిశీలన
పెంచికల్‌పేట్: పెంచికల్‌పేట్ మండల కేంద్రంలో శుక్రవారం రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దనసరి సీతక్క పర్యటన నేపథ్యంలో గురువారం ఎమ్మెల్సీ దండె విఠ ల్, కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పీ శ్రీనివాసరావు ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రుల పర్యటన నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు పాటించాలని అధికారులను ఆదేశించారు. అటవీశాఖ కార్యాలయం వద్ద హెలిప్యాడ్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సభాప్రాంగణం పరిశీలించి పలు సూచనలు చేశారు. సభను విజయవంతంగా నిర్వహించటానికి అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వారి వెంట అదనపు కలెక్టర్ దీపక్ తివారీ, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డేవిడ్, కాగజ్‌నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, డీఎస్పీ రామానుజం, డీపీవో గంగాధర్, డీఆర్‌డీవో దత్తరాం, తహసీల్దార్ వెంకటేశ్వర్‌రావు, ఎంపీడీవో అల్బర్ట్, అన్నిశాఖల అధికారులు, పోలీసు సిబ్బంది ఉన్నారు.