
యాసంగి ధాన్యం సేకరణలో జాప్యం
కొనుగోలు కేంద్రాల్లోనే వడ్లు
అకాల వర్షాలతో బెంబేలెత్తిపోతున్న అన్నదాతలు
సాక్షి, ఆసిఫాబాద్/దహెగాం: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలుకరించనున్నాయి. త్వరలోనే తెలంగాణ రాష్ట్రంలో వానలు మొదల య్యే అవకాశముందని వాతావరణశాఖ చెబుతోంది. మరోవైపు అకాల వర్షాలు అడపాదడపా కురుస్తున్నాయి. అయినా జిల్లాలో యాసంగి ధాన్యం సేకరణ నత్తనడకన సాగుతోంది. నేటికీ జిల్లాలో పూర్తిస్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడమే ఇందుకు కారణం.
లక్ష్యం నెరవేరేనా..?
జిల్లాలో 24 వేల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశా రు. ఈ యాసంగిలో 55 వేల మెట్రిక్ టన్నుల ధా న్యం చేతికొచ్చే అవకాశం ఉందని వ్యవసాయశాఖ అధికారులు అంచనా వేసింది. పౌరసరఫరాల శాఖ మాత్రం కేవలం 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. వాస్తవానికి జిల్లాలో పంట చేతికొచ్చేది ఏప్రిల్ చివరాఖరుకు. ఇక్కడ వాతావరణ పరిస్థితులు.. పత్తి పంటపైనే మొగ్గుచూపడం వంటి కారణాలతో అనుకున్న మేర వరి సాగుకావడం లేదు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇతర జిల్లాలో ఏప్రిల్ మొదటి వారం నుంచే ధాన్యం కొనుగోళ్లు చేపట్టగా.. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఆలస్యంగా ఈ ప్రక్రియ ప్రారంభించారు.
ఇప్పటివరకు కేవలం 1,120 మెట్రిక్ టన్నుల వడ్లు మా త్రమే కొన్నారు. వచ్చే రెండు వారాల్లో మిగిలిన ధా న్యాన్ని ఎలా కొంటారనే ప్రశ్న రైతులను వేధిస్తోంది. కొంతమంది ప్రైవేటు వ్యాపారులకు ధాన్యం వి క్రయిస్తున్నారు. ప్రభుత్వం వరి ధాన్యం ఏ గ్రేడ్ రకా నికి రూ.2,320, బీ గ్రేడ్ రకానికి రూ.2,300 ప్రకటించింది. సన్నరకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.500 బోనస్ చెల్లిస్తోంది. దళారులు మాత్రం క్వింటాల్‌కు రూ.1800 నుంచి రూ.1900 వరకు మాత్రం చెల్లిస్తున్నారు. ప్రైవేటు వ్యాపారులు నాణ్య త, తేమ శాతం పరిశీలించకుండానే కొంటున్నారు.
ఆందోళనలో రైతులు
జిల్లాలో 34 కొనుగోలు కేంద్రాలు ఉండగా.. 25 కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. కేంద్రాలకు ధాన్యం తెచ్చిన రైతులకు పడిగాపులు తప్పడం లేదు. ప్రస్తుతం కురుస్తున్న అకాల వర్షాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వర్షాలతో పెంచికల్‌పేట్ మండలంలో ఏకంగా 200 మెట్రిక్ టన్నుల ధాన్యం తడిసింది. కౌటాల, దహెగాం మండలాల్లోనూ వర్షం కారణంగా ధాన్యం తడిసింది. కొనుగోలు కేంద్రాల వద్ద టార్పాలిన్లతో ధాన్యాన్ని కప్పి ఉంచినా.. అకాల వర్షాలు వారిని భయపెడుతున్నాయి.

యాసంగి ధాన్యం సేకరణలో జాప్యం