
విధులకు గైర్హాజరు కావొద్దు
రెబ్బెన(ఆసిఫాబాద్): కారుణ్య నియామకాల ద్వారా సింగరేణి సంస్థలో ఉద్యోగాలు పొందుతున్న యువత విధులకు గైర్హాజరు కాకుండా సంస్థ ఉన్నతికి కృషి చేయాలని బెల్లంపల్లి ఏరియా జనరల్ మేనేజర్ విజయ భాస్కర్‌రెడ్డి అన్నారు. బెల్లంపల్లి ఏరియాలో పనిచేస్తూ మెడికల్ ఇన్‌వ్యాలిడేట్ అయిన ఇద్దరు ఉద్యోగుల వారసులకు మంగళవారం గోలేటిలోని జీఎం కార్యాలయంలో నియామక పత్రాలు అందించారు. ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థకు తరగని వనరులు ఉన్నాయన్నారు. క్రమశిక్షణతో పనిచేసి ఉత్పత్తి, ఉత్పాదకత, లక్ష్యసాధనలో భాగస్వాములు కావాలని సూచించారు. తల్లిదండ్రులను కష్టపెట్టకుండా జాగ్రత్తగా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ గోలేటి బ్రాంచి కార్యదర్శి ఎస్.తిరుపతి, ఏరియా అధికారుల సంఘం అధ్యక్షుడు మచ్చగిరి నరేందర్, ఇన్‌చార్జి ఎస్‌వోటూజీఎం ఉమాకాంత్, సీనియర్ పర్సనల్ అధికారి శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ అర్చన తదితరులు పాల్గొన్నారు.