
సమన్వయంతో సమస్యల పరిష్కారం
ఆసిఫాబాద్‌అర్బన్: ప్రజావాణి దృష్టికి వచ్చిన ప్రజల సమస్యలను వివిధ శాఖల అధికారులను సమన్వయం చేసుకుంటూ పరిష్కరిస్తామని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం అదనపు కలెక్టర్ డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్‌రావుతో కలిసి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా వ్యవసాయ బావులకు త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని, పంపుసెట్లు మంజూరు చేయాలని జైనూర్ మండలం ఉషేగాం, పోచంలొద్ది గ్రామాలకు చెందిన రైతులు అర్జీ సమర్పించారు. దివ్యాంగుడినైన తనకు ఆసరా పింఛన్ మంజూరు చేయాలని పెంచికల్‌పేట్ మండలం గుంట్లపేట గ్రామానికి చెందిన సాగర్, దివ్యాంగ పత్రం పునరుద్ధరించి పింఛన్ ఇప్పించాలని ఆసిఫాబాద్ మండలం గుండి గ్రామానికి చెందిన బొమ్మకంటి మంజుల వేర్వేరుగా అధికారులకు విన్నవించారు. తనకు వారసత్వంగా రావాల్సిన భూమిని ఇతరులకు విక్రయించారని, అధికారులు స్పందించి న్యాయం చేయాలని వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన జాడి జయబాయి వినతిపత్రం సమర్పించింది. తన భూమికి హద్దులు నిర్ధారించాలని ఆసిఫాబాద్ మండలం అప్పపల్లి గ్రామానికి చెందిన చునార్‌కర్ లక్ష్మి కోరింది. బెజ్జూర్ సహకార బ్యాంక్ నుంచి రూ.లక్షల ట్రాక్టర్ రుణం పొందానని, బకాయిలు చెల్లించినా నోటీసు అందించారని, అధికారులు న్యాయం చేయాలని రెబ్బెన గ్రామానికి చెందిన పొట్టి ధర్మయ్య అర్జీ అందించాడు. ఎస్సీ కార్పొరేషన్ నుంచి బోరుబావి, విద్యుత్ సౌకర్యం మంజూరు చేయాలని కౌటాల మండలం తాటిపల్లి గ్రామానికి చెందిన గంధం మంజులాబాయి దరఖాస్తు చేసుకుంది. నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని రాళ్లపేట్ గ్రామానికి చందిన రెడ్డి ఉమారాణి వేడుకుంది. 65 ఏళ్లు ఉన్న తనకు వృద్ధాప్య పింఛన్ అందించాలని రెబ్బెన మండలం పర్సనంబాల గ్రామానికి చెందిన ఆదే యాదవ్ కోరాడు.
ఇల్లు ఇవ్వాలి
ఇందిరమ్మ ఇళ్ల పథ కం జాబితాలో నాకు ఇల్లు ఇవ్వాలి. కూలీ పనులు చేసుకుంటున్నా. సొంత ఇల్లు లేకపోవడంతో ప్రస్తుతం అద్దె ఇంట్లో కాలం వెల్లదీస్తున్నాం. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేద కుటుంబాన్ని ఆదుకోవాలి.
– ప్రియాంక, సిర్పూర్(యూ)
నా భూమిలో
ఇళ్లు కట్టుకున్నారు
కెరమెరి శివారులోని సర్వే నం.58/ఆ,58/ఏ/1లో ఏడెకరాల భూమి అనువంశికంగా వచ్చింది. నన్ను భయపెట్టి అందులో 20 మంది ఇళ్లు కట్టుకున్నారు. ఉన్నతాధికారులు స్పందించి నా భూమిని ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలి.
– అబ్దుల్ షేకూర్, కెరమెరి
విధుల్లోకి తీసుకోవాలి
సిర్పూర్(యూ) మండలం మహగావ్ పంచాయతీలో 2018 ఆగస్టు 20 వరకు ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేశా. అదేరోజు ఆరో గ్యం క్షీణించి పక్షవాతం వచ్చింది. 2018 ఆగస్టు 21న నిర్వహించిన ఆడిట్ ప్రజావేదికకు హాజరు కాలేదు. అధికారులు విధుల నుంచి తొలగించారు. ప్రస్తుతం పనిచేయగలను. విధుల్లోకి తీసుకోవాలి.
– కొడప హిరామన్, సిర్పూర్(యూ)
న్యాయం చేయండి
నిరుపేద కుటుంబం మాది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. ఇందిరమ్మ ఇల్లు కోసం దరఖాస్తు చేసుకున్నా. మొదటి లిస్టులో తనకు ఇల్లు మంజూరైనట్లు పేరు వచ్చిందన్నారు. ఇప్పుడు అధికారులను సంప్రదిస్తే సమాధానం ఇవ్వకుండా దాటేస్తున్నారు. ఇల్లు ఉన్నవారికే మంజూరు చేస్తున్నారు. ఇప్పటికై నా తనకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలి.
– లలిత, సిర్పూర్(టి)
కలెక్టర్ వెంకటేశ్ దోత్రే
ప్రజావాణిలో వినతులు స్వీకరణ

సమన్వయంతో సమస్యల పరిష్కారం

సమన్వయంతో సమస్యల పరిష్కారం

సమన్వయంతో సమస్యల పరిష్కారం

సమన్వయంతో సమస్యల పరిష్కారం