
సర్వీస్‌కు నోచుకోని ‘సెంట్రల్ ఏసీ’
● కలెక్టరేట్‌లో అధికారుల తిప్పలు ● నెల రోజులుగా పనిచేయని వైనం..
సాక్షి, ఆసిఫాబాద్: అధునాతన భవనం. రెండేళ్లు దాటలేదు. నేటికీ భవనానికి అవసరమైన సదుపాయాలు కల్పించలేదు. తాజాగా కలెక్టరేట్‌లోని ‘సెంట్రల్ ఏసీ’ పనిచేయకుండా మొరాయించింది. అసలే వేసవి కాలం.. నెల రోజులకుపైగా సెంట్రల్ ఏసీ సిస్టం పనిచేయకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. కలెక్టరేట్‌లో కలెక్టర్, అదనపు కలెక్టర్లు, డీఆర్‌వో, సమావేశ మందిరంతో కలిపి మొత్తం 5 చోట్ల సెంట్రల్ ఏసీ అమర్చారు. డైకిన్ కంపెనీకి చెందిన ఏసీలు అమర్చగా.. అవి ప్రస్తుతం పనిచేయడం లేదు. విద్యుత్ సరఫరాలో హెచ్చుతగ్గుల వల్ల ఏసీలు పనిచేయడాని అవసరమయ్యే చిప్‌లు పాడైపోవడంతో సెంట్రల్ ఏసీ సిస్టం మొత్తం పనిచేయడం లేదని సమాచారం. కలెక్టరేట్ అధికారులు డైకిన్ కంపెనీ ప్రతినిధులను సంప్రదించి.. రిపేరీ చేయాలని కోరగా.. వాటికి సంబంధించిన పరికరాలు కొనుగోలు చేయాలని.. అందుకు డబ్బులు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అయితే ఆ డబ్బులు సమాకూర్చేందుకు సమయం పట్టడం.. ఆ తర్వాత నిధులు సమాకూర్చినా నెల రోజులు దాటినా సెంట్రల్ ఏసీల పరిస్థితి ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా మారింది. అయితే ఏసీలు పనిచేయకపోవడంతో కలెక్టర్, అదనపు కలెక్టర్(స్థానిక సంస్థలు) తన ఛాంబర్లలో కూలర్లను ఏర్పాటు చేసుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
ఒక్క సాకెట్ లేదు...
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా 2023 జూన్ 30న అట్టహాసంగా ప్రారంభానికి నోచుకున్న ఆసిఫాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ సముదాయ భవనం అసౌకర్యాల నడుమ కొట్టుమిట్టాడుతోంది. ఎన్నో అధునాతన హంగులతో నిర్మాణం పూర్తి చేసుకున్న కలెక్టరేట్ భవనంలో నేటికీ విద్యుత్ పరికరాల పరిస్థితి అధ్వానంగా ఉంది. కలెక్టరేట్ భవనంలో ఉన్న 40కు పైగా ఉన్న ప్రభుత్వ శాఖల కార్యాలయాలకు సరైన సాకెట్ వ్యవస్థ లేకపోవడం దురదృష్టకరమని ఉద్యోగవర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.