
శిథిల భవనాల్లో కార్యాలయాలు
● ఆందోళనలో విద్యార్థులు, ఉపాధ్యాయులు ● కొత్త భవనాలు నిర్మించాలని డిమాండ్
చింతలమానెపల్లి: మండల అభివృద్ధి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వ కార్యాలయాలు అభివృద్ధికి దూ రంగా ఉన్నాయి. అసౌకర్యాలు, శిథిల గోడల మధ్య కార్యకలాపాలు నిర్వహించాల్సిన దుస్థితి ఏర్పడింది. కార్యాలయాలకు వచ్చే ప్రజలూ ఇబ్బందులు పడుతున్నారు. పాలనను ప్రజలకు చేరువ చేసేందుకు, స్థానికుల డిమాండ్ మేరకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చింతలమానెపల్లి కేంద్రంగా నూతన మండలాన్ని ఏర్పాటు చేసింది. 2016 అక్టోబర్‌లో సిర్పూర్ నియోజకవర్గంలో పెంచికల్‌పేట్, చింతలమానెపల్లి మండల కేంద్రాలుగా ఏర్పాటయ్యాయి. చింతలమానెపల్లి మండలంలో 19 గ్రామపంచాయతీలున్నాయి. తాత్కాలిక భవనాల్లో మండల కార్యాలయాలు ఏర్పాటు చేసి మండల ప్రజలకు ఆయా శాఖల ద్వారా సేవలందించారు. తహసీల్దార్ కార్యాలయం మొదట అద్దెభవనంలో నిర్వహించి ఆ తర్వాత స్థానికంగా ఉన్న ఒక పాఠశాల భవనానికి తరలించారు. పోలీస్‌స్టేషన్‌ను ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేయగా అనంతరం శాశ్వత భవనాన్ని నిర్మించి అందులోకి మార్చారు. ఎంపీడీవో కార్యాలయాన్ని శిథిలావస్థలో ఉన్న ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఇదే భవనంలో ఎంపీపీ, ఉపాధిహామీ కార్యాలయాలు నిర్వహిస్తున్నారు. ఎంఈవో కార్యాలయం స్థానిక దుబ్బగూడ పాఠశాలలో నిర్వహిస్తున్నారు. వ్యవసాయ, ఇతర ఇంజినీరింగ్ శాఖలకు కార్యాలయాలు లేవు.
శిథిల భవనాలు
మండల పరిషత్, తహసీల్దార్ కార్యాలయాలు నిర్వహిస్తున్న భవనాలు శిథిలావస్థలో.. అసౌకర్యాలకు నిలయంగా మారాయి. మండల పరిషత్ కార్యాల య భవనానికి తాత్కాలిక మరమ్మతులు చేపట్టినా అవి ఎలాంటి ఉపయోగంలోకి రాకుండా పోయా యి. గతేడాది వానాకాలంలో కార్యాలయం వరండా కూలిపోయింది. కూలిపోయిన సమయంలో స మీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. వానాకాలంలో గదుల పైకప్పు నుంచి నీరు ఉరుస్తూ ఉంటుంది. తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేసిన భవనం పాఠశాల పైగదిలో ఉండడంతో కార్యాలయానికి వచ్చిన వృద్ధులు, దివ్యాంగులు ఇబ్బందులకు గురవుతున్నారు. తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లడానికి ఉపయోగించే మెట్ల గోడ శిథిలావస్థలో ఉంది. తహసీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ఎలాంటి వసతులు లేక సిబ్బంది, కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది.
ప్రభుత్వం నుంచి స్పందన లేదు
నూతన మండలాలను ఏర్పాటు చేసిన తర్వాత మండల కేంద్రాల్లో అన్ని వసతులతో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. నివేదికలు అడగలేదని ఆయా శాఖల అధికా రులు చెబుతున్నారు. అన్ని వసతులతో కూడిన భవనాలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.