
బూరెపల్లిలో ప్రాణహిత ప్రాజెక్ట్ సర్వే
చింతలమానెపల్లి: మండలంలోని బూరెపల్లి గ్రామంలో ప్రాణహిత నదివద్ద ప్రాజెక్ట్ నిర్మాణ సర్వేను అధికారులు శనివారం ప్రారంభించా రు. రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారి కె.విఠల్‌రావు ప్రతిపాదన మేరకు జిల్లా నీటి పారుదలశాఖ అధికారులు బూరెపల్లి వద్ద ప్రాజెక్ట్ నిర్మాణాని కి సంబంధించిన సర్వే నిర్వహించారు. ప్రాణ హిత నదికి ఆనుకుని ఉన్న బూరెపల్లి, కోర్సిని, గంగాపూర్ గ్రామాల పరిధిలోని వివరాలు సేకరించారు. ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకున్న నేపథ్యంలో రిటైర్డ్ ఇంజినీరింగ్ అధికారి విఠల్‌రావు ప్రత్యామ్నాయంగా మరోచోట స్థలాన్వేషణ చేపట్టి స్వచ్ఛందంగా ప్రాణహిత నదీ పరీవాహక ప్రాంతాల్లో సర్వే నిర్వహించి నివేదికను నీటిపారుదల శాఖ రాష్ట్ర అధికారులకు అందించారు. ఈనేపథ్యంలో శాఖ అధికారులు సంబంధిత వివరాలు సేకరించాలని కాగజ్‌నగర్ డివిజన్ అధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణానికి గల సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందించాలని నీటిపారుదల శాఖ ఆదేశించింది. సుమారు 10రోజుల పాటు సర్వే నిర్వహించనున్నట్లు నీటి పారుదలశాఖ డీఈ వెంకటరమణ, ఏఈఈ రాజ్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టులో నీటి లభ్యత, నదిలో పునాదులకు అణువైన పరిస్థితులు, ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపునకు గురయ్యే ప్రాంతం, మహారాష్ట్ర వైపు ప్రభావితమయ్యే ప్రాంతాలు తదితర వివరాలు సేకరించనున్నట్లు పేర్కొన్నారు.