
గ్రామసభలు బలోపేతం చేస్తాం
● డీపీవో భిక్షపతిగౌడ్
ఆసిఫాబాద్‌అర్బన్: జిల్లాలో మెరుగైన పాలన కోసం గ్రామసభలు బలోపేతం చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతిగౌడ్ అన్నారు. పరి పాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం, సిబ్బంది, ప్రజాఫిర్యాదులు, పెన్షన్‌ల మంత్రిత్వ శాఖ సహకారంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ భాగస్వామ్యంతో జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా డీపీవో మాట్లాడుతూ తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం– 2018 ప్రకారం గ్రామ సభ పాత్ర, ప్రజల భాగస్వామ్యంతో కూడిన పాలనను ప్రోత్సహించడం, సమాచార హక్కు చట్టం, స్వచ్ఛందంగా సమాచారం వెల్లడించడం ద్వారా పారదర్శకతను ప్రోత్సహించడం, ఎన్నికై న ప్రజా ప్రతినిధులు, అధికారులు, స్వయం సహాయక బృందాలు, మహిళా సాధికారత, బాలల సంరక్షణకు సంబంధించిన చట్టాలు.. ఇతర అంశాలపై శిక్షణ అందించినట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులకు సమాచార భాగస్వామిగా పంచాయతీ కార్యదర్శి పాత్ర, మహిళా ప్రజాప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలు అధిగమించేందుకు సాయం అందించే అంశాలపై చర్చించామన్నారు. కార్యక్రమంలో 35 మంది పంచాయతీ కార్యదర్శులు, రిసోర్స్‌పర్సన్లు మహేందర్‌రెడ్డి, సీహెచ్ రుషి, అధికారులు పాల్గొన్నారు.