
ఒకేసారి నెలరోజుల సరుకులు
● అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవులు ● నేటి నుంచి సరుకుల పంపిణీకి అధికారుల కసరత్తు
ఆసిఫాబాద్‌అర్బన్: గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంలో అంగన్‌వాడీ కేంద్రాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ఆయా కేంద్రాల ద్వారానే ప్రభుత్వం పాలు, గుడ్లు, బాలామృతం సరఫరా చేస్తోంది. అయితే ఈ నెల 1 నుంచి 31 వరకు అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిలో నెలరోజుల సరుకులు ఒకేసారి అందించేందుకు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా అధికారులకు సంబంధిత ఉత్తర్వులు అందాయి.
జిల్లాలో 973 కేంద్రాలు
జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 973 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల పరిధిలో గర్భిణులు 4,356 మంది, బాలింతలు 4,022 మంది, ఏడు నెలలలోపు చిన్నారులు 4,146 మంది, ఏడు నెలల నుంచి ఏడాదిలోపు వారు 4,549, ఏడాది నుంచి మూడేళ్ల లోపు వారు 15,872 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు వారు 20,055 మంది ఉన్నారు. జిల్లా అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మొత్తం 44,702 మందికి లబ్ధి చేకూరుతోంది. ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో 296 అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, 352 కేంద్రాలకు సొంత భవనాలు ఉన్నాయి. ఫ్రీ రెంట్ కింద 325 కేంద్రాలు నడుస్తున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులకు ప్రతిరోజూ ఒకరికి 75 గ్రాముల బియ్యం, 15 గ్రాముల పప్పు, 5 గ్రాముల నూనె, ఒక కోడిగుడ్డు అందిస్తున్నారు. బాలింతలు, గర్భిణులకు ఒక్కొక్కరికి 150 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 200 మిల్లీ లీటర్ పాలు, 16 గ్రాముల నూనె, ప్రతిరోజూ ఒక కోడిగుడ్డు ఇస్తున్నారు. వేసవి సెలవుల సందర్భంగా శనివారం నుంచి నెల రోజులకు సరిపడా సరుకులను ఒకేసారి అందించనున్నారు. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఉత్తర్వులు అందాయి
అంగన్‌వాడీ కేంద్రాలకు వేసవి సెలవుల నేపథ్యంలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఒకేసారి నెల రోజులకు సరిపడా సరుకులు అందించనున్నాం. ఇదివరకే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు కూడా అందాయి. లబ్ధిదారులు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి టీచర్ల ద్వారా సరుకులు తీసుకోవాలి.
– భాస్కర్, జిల్లా సంక్షేమ అధికారి

ఒకేసారి నెలరోజుల సరుకులు