
ప్రాజెక్టు వద్ద సీపీఎం నాయకులు
వాంకిడి(ఆసిఫాబాద్): కుమురంభీం ప్రాజెక్టు భద్రతపై ప్రజాప్రతినిధులు, అధికారులు దృష్టి సారించాలని సీపీఎం రాష్ట్ర నాయకుడు బండ రవికుమార్ డిమాండ్ చేశారు. కుమురంభీం ప్రాజెక్టును మంగళవారం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుమురంభీం ప్రాజెక్టుపై అధికారులు నిర్లక్ష్యం వహించడంతో రైతులు నష్టపోవాల్సి వస్తోందన్నారు. 40 వేల ఎకరాలకు సాగునీరందించాల్సిన ప్రాజెక్టు కనీసం 4వేల ఎకరాలకు కూడా సాగు నీరందించడం లేదని ఆరోపించారు. నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడంతో గతేడాది వచ్చిన భారీ వరదలకు పలుచోట్ల దెబ్బతిన్నట్లు తెలిపారు. మళ్లీ వరదలు వస్తే పదుల సంఖ్యలో గ్రామాలు జలమయం అయ్యే పరిస్థితులు ఉంటాయని, పూర్తిస్థాయిలో మరమ్మతులు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి కూషన రాజన్న, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు దుర్గం దినకర్, జిల్లా కమిటీ సభ్యులు గొడిసెల కార్తీక్, జాదవ్ రాజేందర్, దుర్గం రాజ్‌కుమార్, ముంజం ఆనంద్‌కుమార్, సాయి తదితరులు పాల్గొన్నారు.