వైరారూరల్: రైతులు రసాయన ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ సాగు విధానాలపై దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనరేట్ అధికారి, రైతు వారం ప్రోగ్రాం అబ్జర్వర్ శివానంద్ సూచించారు. తద్వారా నేల ఆరోగ్యమే కాక రైతుల ఆరోగ్యం బాగుంటుందని తెలిపారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’ భాగంగా నిర్వహిస్తున్న ‘రైతు వారం’ కార్యక్రమాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా వైరా మండలం ఖానాపురం రైతు వేదికలో ఏర్పాటుచేసిన సమావేశంలో శివానంద్ మాట్లాడుతూ నేల ఆరోగ్యం, సమగ్రతను కాపాడుకుంటేనే సాగుకు అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. వరిలో సన్న రకాలు, మట్టి పరీక్షకు నమూనా తీసే విధానం, వరి, మొక్కజొన్న కోతల అనంతరం కొయ్యలను కాల్చకుండా నేలలో కలియదున్నితే కలిగే లాభాలు, నానో యూరియా, నానో డీఏపీ ఉపయోగాలపై అవగాహన కల్పించారు. ఆతర్వాత పలువురు రైతులకు భూసార పరీక్ష ఫలితాల కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ధనసరి పుల్లయ్య, జిల్లా ఉద్యానశాఖ అధికారి మధుసూదన్, కేవీకే కోఆర్డినేటర్ పావని, ఏడీఏ తమ్ములపల్లి కరుణశ్రీ, ఏఓ మయాన్ మంజుఖాన్, వైరా మార్కెట్ చైర్మన్ బొళ్ల గంగారావు, సర్పంచ్‌లు భూక్యా బాలాజీ, కారుమంచి ఏసు, మార్కెట్ డైరెక్టర్లు షేక్ మోలాలి, తోటకూర నాగేశ్వరరావు, ఏఈఓ సపావత్ సైదులు తదితరులు పాల్గొన్నారు.
డీఎఫ్‌ఓగా బాధ్యతలు స్వీకరించిన అగర్వాల్
ఖమ్మంవ్యవసాయం: జిల్లా అటవీ అధికారిగా అనూజ్ అగర్వాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ఖమ్మం డీఎఫ్‌ఓగా ఉన్న సిదార్థ్ విక్రమ్ సింగ్‌ను నిజామాబాద్‌కు, వరంగల్ డీఎఫ్‌ఓ అనూజ్ అగర్వాల్‌ను ఖమ్మం బదిలీ చేశారు. ఈమేరకు ఆయన బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ దివాకర్ టీఎస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. అలాగే, జిల్లాలోని అటవీ అధికారులు, ఉద్యోగులు నూతన డీఎఫ్‌ఓను కలిసి శుభాకంక్షలు తెలిపారు.
నేడు మంగళగూడెంలో ప్రజాదర్బార్
ఖమ్మంరూరల్: ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రామంలోని సీతారామచంద్రస్వామి ఆలయ కళ్యాణ మండపంలో మధ్యాహ్నం 3–30 గంటలకు మొదలయ్యే ప్రజాదర్బార్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సహా జిల్లా అధికారులు పాల్గొంటారు. ఈమేరకు మంగళగూడెం, పోలిశెట్టిగూడెం, కామంచికల్, పడమటితండా, దారేడు, తీర్థాల, పోలేపట్లి, పల్లెగూడెం, గోళ్లపాడు గ్రామపంచాయతీల ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తులు అందించవచ్చని అధికారుల తెలిపారు.
ప్రశాంతంగా ఎప్‌సెట్
ఖమ్మం సహకారనగర్: అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఎప్‌సెట్ తొలిరోజైన సోమవారం ప్రశాంతంగా ముగి సింది. పరీక్ష నిర్వహణకు ఖమ్మంలో ఏడు కేంద్రాలను ఏర్పాటుచేశారు. ఆయా కేంద్రాల్లో ఉదయం పరీక్షకు 1,910మందిలో 1,756 మంది, మధ్యాహ్నం పరీక్షకు 1,909మంది విద్యార్థుల్లో 1,776మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. సత్తుపల్లిలో రెండు కేంద్రాలు ఏర్పాటుచేయగా ఉదయం పరీక్షకు 250 మందిలో 226మంది, మధ్యాహ్నం పరీక్షకు 500 మందికి గాను 466మంది హాజరయ్యారు.


