ఏ ఉద్యోగమూ చిన్నది కాదు.. | - | Sakshi
Sakshi News home page

ఏ ఉద్యోగమూ చిన్నది కాదు..

May 5 2026 6:38 AM | Updated on May 5 2026 6:38 AM

తరలివచ్చిన నిరుద్యోగులు

నైపుణ్యాలు పెంచుకుంటే

మెరుగైన అవకాశాలు

మెగా జాబ్‌మేళాను ప్రారంభించిన కలెక్టర్‌ దివాకర

ఉమ్మడి జిల్లా నుంచి పెద్దసంఖ్యలో హాజరైన నిరుద్యోగులు

ఖమ్మంరాపర్తినగర్‌: నిరుద్యోగ యువత ప్రైవేట్‌ ఉద్యోగాలను నిర్లక్ష్యం చేయకుండా, అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ భవిష్యత్‌లో ఉన్నత స్థాయికి చేరాలని కలెక్టర్‌ దివాకర టీ.ఎస్‌. సూచించారు. ఉమ్మడి జిల్లాలోని యువతకు ఉపాధి కల్పించే దిశగా ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఖమ్మం ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో సోమవారం మెగా జాబ్‌ మేళా నిర్వహించారు. ఈ మేళాను కలెక్టర్‌ దివాకర ప్రారంభించి మాట్లాడారు. యువత నిరుద్యోగులుగా ఎక్కువ కాలం ఉండొద్దంటే అందుబాటులో ఉన్న అవకాశాలను చేజిక్కించుకోవాలని తెలిపారు. ప్రైవేట్‌ ఉద్యోగాలను చిన్నచూపు చూడొద్దని, ప్రారంభంలో వేతనం తక్కువగా ఉన్నా వ్యక్తిగత ప్రతిభతో ఉన్నత స్థాయికి చేరొచ్చన్నారు. తనకు తెలిసిన ఓ వ్యక్తి రూ.12 వేల వేతనంతో ఉద్యోగాన్ని ప్రారంభిస్తే ఎనిమిదేళ్ల తర్వాత రూ.లక్షలు సంపాదించే స్థాయికి చేరాడని ఉదహరించారు. అదనపు కలెక్టర్‌ డాక్టర్‌ పి.శ్రీజ మాట్లాడుతూ ఏదో ఒక ఉద్యోగాన్ని ప్రారంభిస్తే అనుభవం, ఆత్మవిశ్వాసం పెరిగి భవిష్యత్‌ లక్ష్యాల సాధన సులువవుతుందని తెలిపారు. టాస్క్‌ సీఈఓ నితిన్‌కుమార్‌రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం డీవైఎస్‌ఓలు టి.సునీల్‌కుమార్‌రెడ్డి, ఎం.పరంధామరెడ్డి, పరిశ్రమల శాఖ జీఎం ప్రవీణ్‌, ఈడీఎం దుర్గాప్రసాద్‌, ఎంప్లాయిమెంట్‌ అధికారి ఎన్‌.మాధవి, ఏసీపీ రమణమూర్తి, డిప్యూటి డీఎంహెచ్‌ఓ చందునాయక్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఈఈ పుష్పలత, కార్పొరేటర్‌ లకావత్‌ సైదులు తదితరులు పాల్గొన్నారు.

2,756మంది హాజరు

జాబ్‌ మేళాలో పాల్గొనేందుకు ఉమ్మడి జిల్లా నుంచి 42,231 రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. పలువురు రెండు, మూడు ఉద్యోగాలకు రిజిస్ట్రేషన్‌ చేసుకోగా మొత్తం 2,756మంది హాజరయ్యారు. ఇంట ర్వ్యూల అనంతరం వీరిలో 1,102 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేశారు. అయితే, ఇంకొందరిని కూడా ఎంపిక చేసే అవకాశముందని తెలిసింది. తొలిదశలో ఎంపికై న వారికి మరో రెండు దఫాలుగా ఇంటర్వ్యూ చేశాక ఈనెల 23న నియామకపత్రాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, జాబ్‌ మేళాకు పెద్దసంఖ్యలో అభ్యర్థులు హాజరైనా ఎవరూ ఇబ్బంది పడకుండా ఏర్పాట్లు చేశామని డీవైఎస్‌ఓ సునీల్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు.

మెగా జాబ్‌మేళాలో 78కంపెనీల బాధ్యులు పాల్గొననుండగా, 3వేల మందికి పైగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని అధికారులు ప్రకటించారు. ఈమేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరుద్యోగ యువతీ, యువకులు తరలిరావడంతో ఎస్‌ఆర్‌ గార్డెన్స్‌ కిక్కిరిసింది. కంపెనీల వారీగా స్టాళ్లు ఏర్పాటుచేసి అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలిస్తూ ఇంటర్వ్యూలు నిర్వహించారు.

Advertisement
 
Advertisement
Advertisement