150 ఎకరాల్లో దెబ్బతిన్న ఉద్యానపంటలు
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలోని పలు మండలాల్లో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులతో కూడిన వర్షం కురవగా విద్యుత్ శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో వృక్షాలు, చెట్ల కొమ్మలు విద్యుత్ లైన్లపై పడ్డాయి. దీంతో స్తంభాలు విరగడమే కాక లైన్లు తెగిపోయాయి. మొత్తం 192 విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, రెండు ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతినడంతో రూ.12లక్షల మేర నష్టం వాటిల్లింది. ఈమేరకు ఆదివారం రాత్రి విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టారు. అనంతరం సోమవారం మరమ్మతులు పూర్తిచేసి సరఫరాను పునరుద్ధరించారు. బోనకల్, కారేపల్లి తదితర మండలాల్లో పనులను ఎస్‌ఈ ఇనుగుర్తి శ్రీనివాసాచారి పర్యవేక్షించారు.
● ముదిగొండ: ముదిగొండ మండలంలో ఈదురుగాలుల కారణంగా పలు గ్రామాల్లో దాదాపు 115విద్యుత్ స్తంభాలు విరిగిపోగా, ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని ఏఈ నారాయణ తెలిపారు.ఈమేరకు కొత్త స్తంభాలను ఏర్పాటు చేసి సరఫరా పునరుద్ధరించామని వెల్లడించారు.
మామిడి, అరటి, బొప్పాయి తోటలకూ నష్టం..
ప్రకృతి వైపరీత్యానికి జిల్లాలో 44 మంది రైతులకు చెందిన 150 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నేలకొండపల్లి, చింతకాని, వైరా మండలాలకు చెందిన 32 మంది రైతులకు చెందిన 121 ఎకరాల్లో మామిడి తోటలు, కామేపల్లి, తిరుమలాయపాలెం మండలాల్లో నలుగురు రైతులకు చెందిన 11 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిన్నది. అలాగే, కూసుమంచి, తిరుమలాయపాలెం మండలాల్లో 8 మంది రైతులకు చెందిన 18 ఎకరాల్లో బొప్పాయి పంట ధ్వంసమైంది. నష్టంపై అధికారులు ప్రాథమిక అంచనాలు రూపొందించినా, ప్రభుత్వం ఆదేశిస్తే సమగ్ర విచారణ అనంతరం పరిహారం చెల్లించే అవకాశముంది.


