వంద శాతం
● ఐదు పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత ● ఉమ్మడి జిల్లాలోని ఇతరచోట్ల కూడా మెరుగైన ఫలితం
నేలకొండపల్లి: క్రమశిక్షణతో కూడిన చదువు... వెనకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి.. ఉపాధ్యాయుల బోధనకు తోడు అధికారుల నిరంతర పర్యవేక్షణ ఫలితంగా తాజాగా విడుదలైన పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాల్లో ఉమ్మడి జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల విద్యార్థులు సత్తా చాటారు. ఉమ్మడి జిల్లాలో 20 బాలుర, బాలికల గురుకుల పాఠశాలలు ఉండగా... ఐదింట్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది. మిగతా గురుకులాల్లోనూ మెరుగైన ఫలితాలు రావడం విశేషం. కాగా, ఖమ్మం జిల్లాలోని గురుకులాల నుంచి 880 మంది విద్యార్థులు ఎస్సెస్సీ పరీక్షలు రాయగా, 862 మంది ఉత్తీర్ణత సాధించారు.
అంతా పేద విద్యార్థులే...
సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 20గురుకుల పాఠశాలలు కొనసాగుతున్నాయి. ఇందులో అత్యధిక శాతం పేద విద్యార్థులే చదువుకుంటున్నారు. మెరుగైన ఫలితాలు వస్తుండడంతో ఏటా ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. మంచి ఫలితాలు వచ్చేలా ఉపాధ్యాయులు, అధికారులు ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. రోజువారీగా శ్రద్ధ కనబర్చడమే కాక సబెక్టుల వారీగా స్టడీ అవర్స్ నిర్వహిస్తుండడంతో మంచి ఫలితాలు నమోదవుతున్నాయి. పదో తరగతి ప్రారంభంలోనే సామర్ధ్య పరీక్ష నిర్వహించి.. విద్యార్థుల స్థాయిని అంచనా వేస్తారు. అందుకు అనుగుణంగా బోధిస్తూ, వెనుకబడిన వారిపై మరింత శ్రద్ధ పెడుతుండడంతో మెరుగైన స్థాయిలో ఉత్తీర్ణత నమోదవుతోంది.
అన్ని చోట్ల మెరుగే...
మధిర సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 99శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే, ఎర్రుపాలెంలో 98.07, అన్నపరెడ్డిపల్లిలో 98.5, దమ్మపేటలో 98.5, వైరాలో 97 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇక పాల్వంచలో 96.2, నేలకొండపల్లిలో 96, అడవిమల్లెలలో 96, ముదిగొండలో 95.23, ములకలపల్లిలో 94.8, మణుగూరులో 94.2, పాల్వంచ(సీడీఈ) 94 శాతం, ఇల్లెందులో 93.3, తిరుమలాయపాలెంలో 92.85, భద్రాచలం గురుకుల పాఠశాలలో 89.47శాతంగా ఉత్తీర్ణత నమోదైంది.
పదోతరగతి విద్యార్థులకు మొదటి నుంచే ప్రణాళికాయుతంగా పాఠాలు బోధిస్తాం. వెనుకబడిన వారిని
గుర్తించేలా పరీక్షలు నిర్వహిస్తాం. అందులో ఫలితంగా ఆధారంగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. ప్రతీ విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి బోధిస్తుండడంతో ఈ ఏడాది కూడా మెరుగైన ఫలితాలు సాధించాం. – జి.శ్రీలత,
ప్రిన్సిపాల్, నేలకొండపల్లి గురుకుల పాఠశాల
టేకులపల్లి, కల్లూరు, దానవాయిగూడెం, సత్తుపల్లి, కూసుమంచి గురుకుల పాఠశాలల్లో ఎస్సెస్సీ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారు.


