తరలించక... తడిసి ముద్దయి | - | Sakshi
Sakshi News home page

తరలించక... తడిసి ముద్దయి

May 4 2026 7:37 AM | Updated on May 4 2026 7:37 AM

ఇన్నాళ్లు మొక్కజొన్నల విక్రయానికి అవస్థ

ఇప్పుడు కాంటా అయినా

రవాణాకు ఆటంకాలు

ఫలితంగా అకాల వర్షానికి తడిసిన పంట నిల్వలు

లారీల కొరతతో ఇబ్బందులు

విక్రయించినా కేంద్రం వద్దే..

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఈ ఏడాది యాసంగిలో మొక్కజొన్న సాగు చేసిన రైతులను అడుగడుగునా సమస్యలు వెంటాడుతున్నాయి. మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటులో అశాసీ్త్రయత, ఎకరాకు 26 క్వింటాళ్ల మొక్కజొన్నలే కొనుగోలు చేస్తామనే నిబంధనతో ఇబ్బందులు ఎదురయ్యాయి. అయినా రూ.2,400 మద్దతు ధర కోసం రైతులు మండుటెండల్లో ఎదురుచూశారు. ఆపై కాంటా అయ్యాక గోదాములకు తరలించే వరకు రైతులదే బాధ్యత అని చెప్పడంతో వాహనాల కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూడాల్సి వచ్చింది. ఇంతలోనే ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో అకాల వర్షం కురవగా మొక్కజొన్నలు తడిసి రైతులు నష్టపోయారు.

అంచనాలకు మించి సాగు..

ఈ యాసంగిలో నీరు పుష్కలంగా ఉండడం, వాతావరణ సమస్యలు లేకపోవడంతో ఉమ్మడి జిల్లాలో 2.43 లక్షల ఎకరాల్లో రైతులు మొక్కజొన్న సాగు చేశారు. కానీ బహిరంగ మార్కెట్‌లో క్వింటా మొక్కజొన్నలకు రూ.1,700కు మించి ధర పెట్టలేదు. దీంతో మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యాన రూ.2,400 మద్దతు ధరతో కొనుగోలు చేస్తామనే ప్రకటన రావడంతో సంతోషపడ్డారు. ఆతర్వాత కొనుగోళ్లలో పరిమితి, కేంద్రాల ఏర్పాటులో ఇక్కట్లు ఎదురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో ప్రస్తుతం 51కేంద్రాల ద్వారా శనివారం వరకు 1.17లక్షల టన్నుల మొక్కజొన్నలు కొనుగోలు చేశారు. ఇంకా 50శాతం మంది రైతులు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నారు.

పెనుభారంగా రవాణా..

కేంద్రాల్లో కొనుగోలు చేసిన మొక్కజొన్నలను ఉమ్మడి జిల్లాతో పాటు సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో గోదాంలకు తరలించే బాధ్యత కాంట్రాక్టర్లకు అప్పగించారు. కానీ కాంట్రాక్టర్లు సరిపడా లారీలను ఏర్పాటు చేయడం లేదు. దీంతో కాంటా వేసిన వారం నుంచి పదిహేను రోజులు దాటినా లారీల జాడ లేక రైతులు సొంతంగా వాహనాలు మాట్లాడుకుంటున్నారు. ఫలితంగా బస్తాకు రూ.50 చొప్పున లారీకి రూ.వేలల్లో ఖర్చయింది. దీనికి తోడు గోదాంల వద్ద వేచి ఉండాల్సి ఉన్నందున లారీ డ్రైవర్లు అదనపు వసూళ్లకు పాల్పడుతుండడంతో రైతులపై భారం పడుతోంది. అలాగే, బస్తాలు అందుబాటులో లేక రూ.25నుంచి రూ.30వెచ్చించి కొనుగోలు చేయగా, హమాలీ ఖర్చులు కూడా రైతులే భరించారు.

మక్క రైతులను

వెంటాడుతున్న సమస్యలు

ఇరవై రోజుల క్రితం మొక్కజొన్నలను కేంద్రానికి తీసుకొచ్చా. మొత్తం 704 క్వింటాళ్లు కాంటా వేసినా లారీలు లేక ఎగుమతి కావడం లేదు. మార్క్‌ఫెడ్‌ నుంచి టన్ను తరలింపునకు రూ.450 చెల్లిస్తున్నా లారీ యజమానులు క్వింటాకు రూ.80 అడుగుతున్నారు. దీంతో టన్నుకు రూ.800 అదనంగా చెల్లించాల్సి వస్తోంది.

– షేక్‌ ఇబ్రహీం, ముష్టికుంట్ల, బోనకల్‌ మండలం

కొణిజర్ల మండలం తనికెళ్లకు చెందిన యాస విష్ణుమూర్తి 12 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తే 480 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. తనికెళ్ల ఎస్సీ సంక్షేమ వసతిగృహం పక్కన కొనుగోలు కేంద్రానికి పంట తరలించి 170 క్వింటాళ్లు అమ్మాడు. కానీ పంటను తరలించేందుకు లారీలు దొరకడం లేదు. ఒకటి, రెండు లారీలు వచ్చినా.. డ్రైవర్లు, లారీ యజమానులు అదనంగా డబ్బులు ఇచ్చిన వారి పంటే తరలించడంతో విష్ణుమూర్తి పడిగాపులు కాస్తున్నాడు. ఈ కేంద్రంలో 200 మంది రైతులు మొక్కజొన్నలు తీసుకురాగా బస్తాలు లేకపోవడంతో రూ.25 నుంచి రూ.30 వరకు చెల్లించి కొనుగోలు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement