ఇక్కడే.. ఇక రోజూ! | - | Sakshi
Sakshi News home page

ఇక్కడే.. ఇక రోజూ!

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

వేదికగా వెలుగుమట్ల పార్క్‌ ఎంపిక 100 ఎకరాల విస్తీర్ణంలో రూ.163 కోట్లతో ప్రతిపాదనలు కేంద్ర జూ అథారిటీ అనుమతి కోసం ప్రయత్నాలు

విశాలమైన స్థలం..

ఖమ్మం శివార్లలోని వెలుగుమట్ల అర్బన్‌ పార్క్‌ ముఖద్వారం

ఖమ్మంవ్యవసాయం: పెద్దపులి, సింహాలు, జింకలు, ఎలుగుబంట్లు, మొసళ్లు, నెమళ్లు.. ఇలా ఒకటేమిటి ఏ జంతువునైనా చూడాలంటే జిల్లా వాసులు హైదరాబాద్‌ నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌కు వెళ్లాల్సిన పనిలేదు. అంతా అనుకూలిస్తే ఖమ్మంలోనే త్వరలో జూ పార్క్‌ ఏర్పాటు కానుంది. తద్వారా మన కళ్ల ముందరే సమస్త జంతులోకం కొలువుదీరనుంది. ఖమ్మం శివార్లలో 546 ఎకరాల్లో కొనసాగుతున్న వెలుగుమట్ల అర్బన్‌ పార్కు పరిధిలో జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు సన్నాహాలు మొదలయ్యాయి. ఇక్కడ జూపార్క్‌ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సిద్ధం చేయాలని అటవీ శాఖను ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యాన అధికారులు రంగంలోకి దిగారు. ఈ మేరకు తమిళనాడుకు చెందిన కన్సెల్టెన్సీ బాధ్యులు మూడు నెలల పాటు వెలుగుమట్ల అర్బన్‌ పార్క్‌లోని వృక్షాలు, నీటి వనరులే కాక జంతువుల మనుగడకు ఉన్న అవకాశాలపై అధ్యయనం చేసి వీడియో రూపొందించారు.

నిపుణుల బృందం పరిశీలన

మంత్రి సూచనలతో జూ పార్క్‌ ఏర్పాటుకు వెలుగుమట్ల పార్క్‌ అనుకూలంగా ఉంటుందని జిల్లా అటవీ శాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఆపై తమిళనాడుకు చెందిన ఓ కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించగా.. ఆ బృందంలోని నిపుణులు మూడు నెలల పాటు అధ్యయనం చేశారు. వెలుగుమట్ల అర్బన్‌ పార్కు పరిధిలోని పుట్టకోట, రుద్రమకోట ప్రాంతా(పార్కు వెనుక భాగం)ల్లో 100 ఎకరాలు జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు అనుకూలంగా ఉంటుందని తేల్చినట్లు సమాచారం. ఈ ప్రాంతంలో జంతువుల జీవనానికి అవసరమైన వనరులు, నీటి వసతి, వాతావరణం ఉండడంతో సమగ్ర నివేదికను రూపొందించారు. అంతేకాక ఓ వీడియోను రూపొందించి అటవీ శాఖకు సమర్పించారు.

ఫెన్సింగ్‌ కూడా ఉండడంతో..

తమిళనాడు కన్సెల్టెన్సీ బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా అటవీ శాఖ అధికారులు జూపార్క్‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించారు. వెలుగుమట్ల అర్బన్‌ పార్కు పరిధిలోని 100 – 120 ఎకరాల విస్తీర్ణంలో జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు ప్రతిపాదించారు. ఇక్కడ అవసరమైన నిర్మాణాలు, జంతువుల రవాణా తదితర అవసరాలకు రూ.163 కోట్లు అవసరమని ప్రతిపాదనల్లో పేర్కొన్నట్లు తెలిసింది. అంతేకాక అర్బన్‌ పార్కుకు చెయిన్‌ ఫెన్సింగ్‌ ఉండడం కలిసొస్తుందని నివేదికలో పొందుపర్చారని సమాచారం.

అనుమతే తరువాయి..

జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ పరిధిలోని జూఅథారిటీ నుంచి అనుమతి పొందాలి. ఈ నేపథ్యాన వెలుగుమట్ల అర్బన్‌ పార్కులో జూపార్క్‌ ఏర్పాటుకు ఉన్న వనరులు, తమిళనాడు బృందం రూపొందించిన వీడియోకు తోడు జిల్లా అధికారులు సిద్ధం చేసిన సమగ్ర నివేదికను జూ అథారిటీకి సమర్పించారు. ఈ నివేదికను పరిశీలించిన కేంద్ర జూ అథారిటీ నుంచి ప్రత్యేక బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కృషి జరుగుతుండగా.. సదరు బృందం వచ్చి సానుకూలత వ్యక్తం చేస్తే జంతు ప్రదర్శన శాల ఏర్పాటుకు రాష్ట్రం తరఫున రంగంలోకి దిగాల్సి ఉంటుంది. ఈవిషయంపై ఇటీవల బదిలీ అయిన జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. వెలుగుమట్ల అర్బన్‌ పార్కులో జంతు ప్రదర్శన శాలకు రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపారు. ప్రాథమికంగా అందుకు అవసరమైన చర్యలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు.

త్వరలోనే ఖమ్మంలో జంతు ప్రదర్శనశాల

వెలుగుమట్ల అర్బన్‌ పార్కు 546 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఈ పార్క్‌లో వివిధ జాతుల భారీ వృక్షాలు ఉండడంతో పక్షుల సందడితో పర్యాటకుల రాక నానాటికీ పెరుగుతోంది. సాధారణ రోజుల్లోనే రద్దీ ఉంటుండగా.. ఆదివారం వస్తే కుటుంబాలతో సహా జిల్లా వాసులు వస్తుండడంతో సందడి ఉంటోంది. ఇక్కడ బోటింగ్‌ ఏర్పాటుకు సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఖమ్మం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచనలతో జంతు ప్రదర్శనశాల ఏర్పాటుకు అధికారులు అడుగులు వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement