‘నీట్‌’ నిర్వహణకు రెడీ.. | - | Sakshi
Sakshi News home page

‘నీట్‌’ నిర్వహణకు రెడీ..

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

● నేడు జిల్లాలోని ఏడు కేంద్రాల్లో పరీక్ష ● మధ్యాహ్నం 1.30 గంటల వరకే అనుమతి

సమయానికి చేరుకోవాలి

● నేడు జిల్లాలోని ఏడు కేంద్రాల్లో పరీక్ష ● మధ్యాహ్నం 1.30 గంటల వరకే అనుమతి

ఖమ్మంసహకారనగర్‌: 2025 – 26 విద్యా సంవత్సరానికి వైద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఆధ్వర్యాన ఆదివారం నీట్‌ (నేషనల్‌ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్‌ టెస్టు) నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇప్పటికే అదనపు కలెక్టర్‌ శ్రీనివాసరెడ్డి పలు శాఖల అధికారులతో సమీక్షించి సూచనలు చేశారు.

2,762 మంది విద్యార్థులు

జిల్లాలో నీట్‌ నిర్వహణకు ఏడు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆయా కేంద్రాల్లో 2,762 మంది పరీక్ష రాయనున్నారు. వీరిలో బాలురు 742 మందే ఉండగా, బాలికలు 2,020 మంది ఉండడం విశేషం. కాగా, ఖమ్మంలోని ఎస్‌ఆర్‌ అండ్‌ బీజీఎన్‌ఆర్‌ డిగ్రీ కళాశాలలో 720 మంది, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 600, పీఎంశ్రీ కేంద్రియ విద్యాలయంలో 360, ఏఎస్‌ఆర్‌ శాంతినగర్‌ పాఠశాలలో 360, ఎన్నెస్పీ కాలనీ ప్రభుత్వ పాఠశాలలో 360, యూనివర్సిటీ పీజీ కళాశాలలో 360 మంది, నయాబజార్‌ ప్రభుత్వ పాఠశాలలో 122 మంది విద్యార్థులను కేటాయించారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు జరుగుతుంది. అయితే, విద్యార్థుల ధ్రువీకరణ పత్రాలను తనిఖీ చేయాల్సి ఉన్నందున ఉదయం 11 నుంచే అనుమతిస్తామని, మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు.

ఈ సూచనలు తప్పనిసరి

●పరీక్ష కేంద్రాల గేట్లను మధ్యాహ్నం 1.30 గంటలకు మూసివేస్తారు. ప్రతీ విద్యార్థి ప్రభుత్వం జారీ చేసిన గుర్తింపు కార్డు ఒరిజనల్‌ కాపీ తీసుకురావాలి. అడ్మిట్‌కార్డు, రెండు పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోలు, ఒక పోస్టుకార్డు ఫొటో వెంట తెచ్చుకోవాలి. సొంత వాటర్‌ బాటిల్‌ తీసుకురావాలి. కాళ్లకు బూట్లు కాకుండా స్లిప్పర్లు వేసుకెళ్లాలి. ఆభరణాలు, స్మార్ట్‌వాచ్‌లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు తీసుకురావొద్దు. హాఫ్‌ హ్యాండ్‌ షర్ట్‌లు మాత్రమే ధరించాలి.

నీట్‌ పకడ్బందీగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాం. విద్యార్థుల తనిఖీ, గుర్తింపు కార్డుల పరిశీలనలో జాప్యం జరగకుండా ఉదయం 11 గంటల నుంచే అనుమతిస్తాం. మధ్యాహ్నం 1.30 గంటల తర్వాత అనుమతి ఉండదు. ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తించాలి.

– నరేందర్‌, నీట్‌ జిల్లా నోడల్‌ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement