సత్తుపల్లి: గ్రామ, మండల, జిల్లాస్థాయి సమస్యలను ఒక్కటొక్కటిగా ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తామని కలెక్టర్ దివాకర టీఎస్ వెల్లడించారు. సత్తుపల్లి నియోజకవర్గ ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక సమీక్ష ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన శనివారం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. వచ్చే రెండేళ్లల్లో చేయాల్సిన అభివృద్ధిపై ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు. అర్హులైన ప్రతీఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికార యంత్రాంగం పనిచేస్తుందని, రేషన్‌కార్డు కావాల్సిన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా జారీ చేస్తామని తెలిపారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహారం, కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు కానున్నందున ప్రవేశాలు పెరిగేలా అందరూ సహకరించాలని సూచించారు. ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే ప్రతీ ఇంటికి రెండు, మూడు పథకాలు ఇచ్చిందని వెల్లడించారు. కాంగ్రెస్ ఏం చేసిందని ప్రశ్నించే వారు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు. కాగా, కల్లూరు మున్సిపాలిటీలో నిధులు లేక కార్మికులకు ఎనిమిది నెలల వేతనాలు చెల్లించలేదని మున్సిపల్ చైర్మన్ ధరావత్ మోహన్‌నాయక్ తెలిపారు. ఈ మేరకు ప్రత్యేక గ్రాంట్ మంజూరు, డంపింగ్‌యార్డ్ ఏర్పాటుపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే, వేంసూరు మండలం అమ్మపాలెంలో నీటి సమస్యపై సర్పంచ్ కాంతారెడ్డి వివరించగా, ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు ప్రత్యేక సీట్లు కేటాయించి, బస్సుల సంఖ్య పెంచాలని డీసీసీ అధికార ప్రతినిధి గంగిశెట్టి ప్రసాద్ సూచించారు. కల్లూరు సబ్ కలెక్టర్ అజయ్‌యాదవ్, సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ ఎండీ రెహానాబేగం, మార్కెట్ చైర్మన్లు బాగం నీరజాదేవి, దోమ ఆనంద్‌బాబు, నాయకులు ఎండీ కమల్‌పాషా, భీమిరెడ్డి సుబ్బారెడ్డి, గాదె చెన్నారావు, చల్లగుళ్ల నర్సింహారావు, నారాయణవరపు శ్రీనివాస్, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ దివాకర


