● ధాన్యం, మక్కలు అమ్మిన వారంలోగా ఖాతాల్లో నగదు జమ ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
వైరా: రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజాప్రభుత్వం ద్వారా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతాయని రాష్ట్ర రెవెన్యూ, సమాచార, గృహనిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ‘ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక’లో భాగంగా వైరా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శనివారం జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడారు. గత పాలకులు తెలంగాణను అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. పేదలకు ఇల్లు కట్టిస్తే లాభం ఉండదని భావించి కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి నిధులు నీళ్ల పాలు చేశారని పేర్కొన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక ఆడబిడ్డలు, దళిత, గిరిజనులు, రైతుల పక్షాన నిలుస్తూ పాలన సాగిస్తున్నామని తెలిపారు. ఇది తట్టుకోలేక ప్రతిపక్షాలు తమపై విమర్శలు చేస్తూ తిరిగి వారు అధికారంలోకి వస్తారని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. కాగా, ధాన్యం, మక్కలు అమ్మిన రైతులకు వారంలోగా ఖాతాల్లో డబ్బు జమ చేస్తామని పొంగులేటి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు తీరుస్తూనే సంక్షేమ, అభివృద్ధి పథకాలు అందిస్తున్నామని వెల్లడించారు. వైరా ఎమ్మెల్యే రాందాస్‌నాయక్ మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా అధికారులు కృషి చేయాలన్నారు. సమావేశంలో మహబూబాబాద్ ఎంపీ బలరామ్‌నాయక్, కలెక్టర్ దివాకర టీఎస్, మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ కాపా చంద్రకళ, వైస్ చైర్మన్ కట్ల సంతోష్, డీఎల్‌పీఓ రాంబాబు, తహసీల్దార్ సురేశ్, ఎంపీడీఓ సక్రునాయక్, నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, శీలం వెంకటనర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


