మార్గదర్శకాల మేరకే పేదలకు గృహాలు | - | Sakshi
Sakshi News home page

మార్గదర్శకాల మేరకే పేదలకు గృహాలు

May 3 2026 7:53 AM | Updated on May 3 2026 7:53 AM

ఖమ్మంగాంధీచౌక్‌: ప్రభుత్వ మార్గదర్శకాల మేరకే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నట్లు గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ బి.శ్రీనివాస్‌ తెలిపారు. కూసుమంచి మండలం పాలేరులో ఇటీవల నిర్వహించిన ప్రజాదర్బార్‌లో లబ్ధిదారురాలు పిల్లి నీలమ్మ ప్రసంగంపై ప్రచారం జరగడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేపట్టామని ఆయన వెల్లడించారు. ఎంపీడీఓ, గ్రామ పంచాయతీ కార్య దర్శి, హౌసింగ్‌ ఏఈతో పిల్లి నీలమ్మ ఇంటిని పరిశీలించిన సమయాన బీపీఎల్‌ వర్గానికి చెందినట్లు గుర్తించారని తెలిపారు. ఆమె దినసరి కూలీ కాగా, భర్త మల్లయ్య మత్స్యకారుడని తేలిందన్నారు. ఆపై ఇందిరమ్మ కమిటీ సిఫారసుతో ఆ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసినట్లు తెలిపారు. కాగా, ఈ కుటుంబం అవసరాల కోసం కొంత భూమిని విక్రయించగా, ఒక సంతానాన్ని విదేశాలకు పంపేందుకు రుణం తీసుకున్నారని పేర్కొన్నారు. ఆయన ట్యూషన్‌ఫీజులో ఎక్కువ భాగం విదేశీ యూనివర్సిటీ నుంచి స్కాలర్‌షిప్‌ రూపంలో లభించిందని చెప్పారు. ఈక్రమంలోనే నీలమ్మను కూడా విచారించగా మొదటిసారి వేదికపై మాట్లాడడంతో పొరపాటు పడ్డానని వివరించిందని తెలిపారు. తన భర్త మత్స్యకారుడిగా, తాను కూలీ పనులతో పిల్లలను చదివించామే తప్ప ఎవరినీ మోసం చేయనందున తప్పుడు ప్రచారం చేయవద్దని కోరిందని వెల్లడించారు. ఈ మేరకు అసత్య ప్రచారాలను నమ్మవద్దని పీడీ కోరారు.

పాలేరులో ఇందిరమ్మ ఇంటిపై

సమగ్ర విచారణ

Advertisement
 
Advertisement
Advertisement