● జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభం ● పోలీసు శాఖలోని ఎఫ్‌ఐఆర్ తరహాలో నిర్వహణ
ఖమ్మంవ్యవసాయం: నేరాల నియంత్రణకు ఖమ్మం జిల్లా అటవీ శాఖ ఆన్‌లైన్ పీఓఆర్(ప్రిలిమినరీ ఆఫీస్ రిపోర్ట్) వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. పోలీసు శాఖలో ఎఫ్‌ఐఆర్ తరహాలో ఈ వ్యవస్థ అమలుకు సిద్ధమయ్యారు. జిల్లా అటవీ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ నేతృత్వాన పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. అటవీ నేరాల నియంత్రణలో పారదర్శకత, సాంకేతిక ఆధారాల సేకరణ, న్యాయపరమైన అంశాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందించినట్లు డీఎఫ్‌ఓ తెలిపారు. అంతేకాక ఈ–పీఆర్‌ఓ (ఎలక్ట్రానిక్ పంచనామా ఆఫ్ ఆఫీస్ రిపోర్ట్) వ్యవస్థను జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. తద్వారా చెట్ల నరికివేత, వన్యప్రాణి నేరాలు, అటవీ భూముల ఆక్రమణలు, అక్రమ రవాణాపై ఆన్‌లైన్ నమోదు, డిజి టల్ కేసు పర్యవేక్షణ విధానం అమల్లోకి రానుంది.
నూతన వ్యవస్థతో ప్రయోజనాలు
క్షేత్రస్థాయి నుంచే అటవీ నేరాలపై ఆన్‌లైన్‌లో కేసు నమోదు చేసే అవకాశం ఏర్పడుతుంది. అంతేకాక పంచనామా, సాక్ష్యాధారాలన్నీ డిజిటల్ విధానంలో నమోదవుతాయి. తద్వారా సిబ్బందిలో పారదర్శకత, జవాబుదారీతనం పెరగడమే కాక ఉన్నతా ధికారుల పర్యవేక్షణ సులువవుతుంది. అంతేకాక సాక్ష్యాధారాలు తారుమారు చేసే పరిస్థితి ఉండదు. డిజిటల్ ఆధారాలతో న్యాయస్థానాల్లో చార్జిషీట్లు దాఖలు చేస్తే నిందితులు తప్పించుకునే వీలుండదు. ఈ సందర్భంగా డీఎఫ్‌ఓ సిద్ధార్థ్ విక్రమ్‌సింగ్ మాట్లాడుతూ అడవులు, వన్యప్రాణులు, అటవీ ఉత్పత్తుల రక్షణకు ఈ–పీఓఆర్ వ్యవస్థ తోడ్పాటునిస్తుందని తెలిపారు. ఈ విధానంతో పాలనాపరమైన మార్పులు కూడా చోటుచేసుకుంటాయని చెప్పారు. నూతన విధానాన్ని జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తుండగా, త్వరలోనే రాష్ట్రమంతా అమలయ్యే అవకాశం ఉందని తెలిపారు.


