మధిర: పంటల సాగు సమయాన రైతులు మేలు రకం విత్తనాలను ఎంపిక చేసుకోవాలని, తద్వారా ఎలాంటి ఇబ్బంది ఎదురుకావాలని మధిర వ్యవసాయ పరిశోధనా శాస్త్రవేత్త రుక్మిణీదేవి తెలిపారు. మండలంలోని మాటూరు రైతువేదికలో గురువారం నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సమావేశంలో ఆమె మాట్లాడారు. అవసరానికి మించి యూరియా వాడితే నష్టమే తప్ప లాభం ఉండదని చెప్పారు. అలాగే, పంట మార్పిడి పద్ధతిని అవలంబిస్తూ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో కీటక శాస్త్రవేత్త నాగస్వాతి, మధిర ఏడీఏ విజయ్‌చంద్ర, ఏఓ సాయిదీక్షిత్, ఏఈఓ నిఖిత తదితరులు పాల్గొన్నారు.
●వేంసూరు: వేంసూరు మండలం అమ్మపాలెంలో నిర్వహించిన ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’ సదస్సులో అశ్వరావుపేట వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ హేమంత్ కుమార్, పొఫెసర్ డాక్టర్ గీతాంజలి పాల్గొన్నారు. యూరియా, పురుగు మందుల వాడకం తగ్గింపు, పంట మార్పిడితో లాభాలు, సాగునీటి వినియోగంలో పొందుపు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ పెద్దగాండ్ల ప్రసన్నతో పాటు ఏఓ వి.రామ్మోహన్, ఏఈఓలు ఎస్.కే.రిమా, సందీప్, స్వాతి పాల్గొన్నారు.
●తిరుమలాయపాలెం: యూరియా అధిక వినియోగంతో భూసారం దెబ్బతింటుందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ వి.చైతన్య తెలిపారు. మండలంలోని హస్నాబాద్ రెతు వేదికలో నిర్వహించిన రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు సదస్సులో ఆమె మాట్లాడారు. రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించి సేంద్రియ విధానంలో పంటలు సాగు చేయాలని సూచించారు. ఏఓ నారెడ్డి సీతారాంరెడ్డి సర్పంచ్ కొవ్వూరి పద్మ, ఏఈఓలు కళ్యాణి, ప్రదీప్ పాల్గొన్నారు.


