● చికిత్స పొందుతున్న బాలిక మృతి
ఖమ్మంఅర్బన్: ఖమ్మం కవిరాజనగర్‌లోని రోడ్డు నెంబర్–12కు చెందిన ధారవల్లి హర్షిత (16) చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందింది. ఇటీవల పదో తరగతి పూర్తిచేసిన ఆమె ఫోన్ చూస్తుండడంతో గత నెల 24వ తల్లి మందలించగా ఎలుకల మందు మింగింది. దీంతో కుటుంబీకులు ఖమ్మంలో చికిత్స అనంతరం హైదరాబాద్ తరలించగా పరిస్థితి విషమించడంతో మృతి చెందింది. కాగా, పదో తరగతి పరీక్షలు వెలువడిన బుధవారమే హర్షిత మృతి చెందడం.. ఫలితాల్లో ఆమె 530మార్కులతో పాసైనట్లు తేలగా కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై ఆమె కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేసినట్లు ఖమ్మంఅర్బన్ పోలీసులు తెలిపారు.
గుర్తుతెలియని యాచకుడు మృతి
ఖమ్మంక్రైం: ఖమ్మం రైల్వేస్టేసన్ సమీపంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద గుర్తుతెలియని యాచకుడు(35) మృతి చెందాడు. ఈ విషయాన్ని గురువారం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారి సూచనలతో అన్నం ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరావు ఆధ్వర్యాన మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కాగా, మృతుడు కొన్నాళ్లుగా భిక్షాటనతో జీవిస్తూ షాపింగ్ కాంప్లెక్స్ వద్ద పడుకునేవాడని తెలిసింది.
యువకుడి ఆత్మహత్య
మధిర: మండలంలోని మహాదేవపురానికి చెందిన పాణిది మురళి(22) బుధవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయన తండ్రి మూడేళ్ల క్రితం మృతి చెందగా, తల్లి కూళీ పనులకు వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఈనేపథ్యాన మనస్థాపానికి గురైన మురళి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఘటనపై ఆయన తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.


