ఖమ్మంఅర్బన్: భవిష్యత్ తరాల అవసరాలకు అనుగుణంగా ఖమ్మం అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం 58వ డివిజన్‌లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెయిన్ల నిర్మాణ పనులకు బుధవారం ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. వచ్చే యాభై ఏళ్ల ప్రజావసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపడుతున్నందున అధికారులు నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం రహదారుల విస్తరణ జరగాలని తెలిపారు. అలాగే, పరిశుభ్రతలో ప్రస్తుతం మూడో స్థానాన ఉన్న ఖమ్మంను మొదటి స్థానానికి చేర్చేలా యంత్రాంగం కృషి చేయాలని సూచించారు. కాగా, వచ్చేనెల 4న జరగనున్న మెగా జాబ్‌మేళాలో ఎక్కువ మంది నిరుద్యోగులు పాల్గొనేలా విస్తృత ప్రచారం చేయాలని, ఇందుకోసం అన్ని పార్టీల నాయకులు సహకరించాలని మంత్రి కోరారు.
●ఖమ్మంగాంధీచౌక్: ఖమ్మంలోని శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం(గుట్ట)లో జరుగుతున్న బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తొలుత నిర్వాహకులు మంత్రికి స్వాగతం పలకగా ఆయన స్వామికి పూజలు చేసి మాట్లాడారు. ఈ కార్యక్రమాల్లో మేయర్ పునుకొల్లు నీరజ, రాష్ట్ర విత్తన గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ యరగర్ల హన్మంతరావు, కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్‌చౌదరి, నాయకులు సాధు రమేష్‌రెడ్డి, శెట్టి రంగారావు, తోటకూరి శివయ్య, మిక్కిలినేని నరేంద్ర, ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు డాక్టర్ ప్రదీప్‌కుమార్, ఈఓ కొత్తూరు జగన్మోహన్‌రావు పాల్గొన్నారు.
రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


